పవన్ కళ్యాణ్ ఏలూరు బహిరంగ సభ జనసంద్రమైంది. నిన్న దెందులూరులో చింతమనేని పై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్ ఇవాళ కూడా అదే జోరు కొనసాగించారు. అలాగే జనసేన ఓట్ బ్యాంక్ గురించి జనసేన బలం గురించి లగడపాటి సర్వే లు అంటూ వస్తున్న వార్తలపై స్పందించారు పవన్ కళ్యాణ్.
జనసేన పార్టీకి కేవలం 4 శాతం, లేదంటే 5 శాతం మాత్రమే ఓట్లు ఉన్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాడు పవన్ కళ్యాణ్. అలాగే కొంతమంది లగడపాటి సీక్రెట్ సర్వేలు అంటూ, జనసేన బలాన్ని కించపరిచే విధంగా వస్తున్న వార్తలపై కూడా స్పందించారు. లగడపాటి కొన్ని నెలల క్రితం తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించడానికి తన ఇంటికి వచ్చాడు అని, ఆ సందర్భంలో జనసేన పార్టీ బలం గురించి ఆయనతో చర్చించడం జరిగిందని, జనసేన పార్టీ సహాయం లేకుండా ఆంధ్రప్రదేశ్ లో 2019 లో ఏ ప్రభుత్వం ఏర్పడ లేదని, జనసేన పార్టీ ప్రభుత్వంలో భాగస్వామి గా ఉంటుంది అని తనతో చెప్పాడని, కావాలంటే మీరు వెళ్లి లగడపాటి తో చెక్ చేసుకోవచ్చని పవన్ కళ్యాణ్ చెప్పారు.
అలా ప్రభుత్వంలో భాగస్వామి కావాలంటే కనీసం 18 శాతం ఓటు బ్యాంకు ఉండాలని, తమకు అలా లగడపాటి లెక్కల ప్రకారం చూసుకున్నా, 18 శాతం ఓటు బ్యాంకు ఉన్నట్టేనని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. నిజంగా మనకు కేవలం వాళ్ళన్నట్టు 4 శాతం నుంచి 5 శాతం మాత్రమే ఓట్లు ఉండి ఉంటే తమను అసలు ఈ పార్టీలు పట్టించుకుని ఉండేవి కావని వివరించాడు పవన్ కళ్యాణ్.
ఏది ఏమైనా, లగడపాటి సర్వే అంటూ పేరు చెప్పి జనసేన పార్టీ పై మరొకరు దుష్ప్రచారం చేయకుండా పవన్ కళ్యాణ్ చెక్ పెట్టినట్టే అని చెప్పవచ్చు.