తాజా పరిస్థితుల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు! కేంద్రంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం, పార్లమెంటులో చర్చ నేపథ్యంలో… ఎలాగూ వైకాపా తన కార్యాచరణ సిద్ధం చేసేసుకుంది. 24న బంద్ కు పిలుపునిచ్చింది. టీడీపీ ఎంపీలందరూ రాజీనామా చెయ్యాలీ, చంద్రబాబుకు కనువిప్పు కలగాలన్న వాదనను ఎత్తుకుని మరోసారి జనంలోకి వెళ్లబోతున్నట్టు ప్రతిపక్ష నేత జగన్ సంకేతాలు ఇచ్చారు. ఇక, మిగిలింది పవన్ కల్యాణ్… ఎందుకంటే, ఆయన కూడా యాత్రలు చేస్తున్నారు కదా! ఆయన కూడా దాదాపు జగన్ లాంటి నిర్ణయమే తీసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దంద్వ వైఖరికి నిరసనగా కవాతు చేస్తానంటూ తాజా ప్రకటనలో పేర్కొన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను ఢిల్లీకి వినిపించేలా కృషి చేస్తామనీ, మడమ తిప్పకుండా పోరాటం చేస్తామని పవన్ అంటున్నారు!
తెలుగుదేశం ఎంపీలు భాజపాని తిడుతూ, అదే పార్టీతో కాళ్లబేరాలకు వెళ్లారంటూ అని ట్వీట్ల ద్వారా ఆరోపించారు. భాజపాను వెనకేసుకుని వస్తున్నానని తనపై ఆరోపణలు చేస్తున్నారనీ, తద్వారా తనకు కలిగే లాభమేంటన్నారు. ఆంధ్రా ప్రజలు భాజపాని పూర్తిగా వదిలేశారనీ, అలాంటి పార్టీతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా అని అభిప్రాయపడ్డారు. గల్లా జయదేవ్ కి మెమరీ లాస్ ఉందంటూ మరో ట్వీట్ లో ఎద్దేవా చేశారు. టీడీపీకి కూడా గజినీ మాదిరిగా మతిమరుపు వ్యాధి ఉందంటూ ఇంకోట ట్వీట్ లో సెటైర్ వేశారు. ఇలా అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో టీడీపీ సర్కారుపై విమర్శలకే పరిమితమౌతూ వచ్చారు పవన్ కల్యాణ్.
నిజానికి, కేంద్రంపై అవిశ్వాసం నేపథ్యంలో పవన్ సానుకూలంగా స్పందించి ఉంటే కొంతైనా బాగుండేది. రాష్ట్రానికి సమస్యలున్నాయనీ, కేంద్రం నిధులు ఇవ్వలేదని ఆయనా విమర్శిస్తారు కదా! అలాంటప్పుడు, కేంద్రం తీరుపై పార్లమెంటులో చర్చ జరిగితే… కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా, ఎక్కడో కూర్చుని ట్వీట్లకే పరిమితమైతే ఎలా..? అంటే, అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా మాట్లాడితే… టీడీపీకి మద్దతు ఇచ్చినట్టు అవుతుందని భావించారా..? మరి, ఈ క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలను వదిలేసినట్టే కదా! పోనీ, ఈ సందర్భంగా తటస్థంగా ఉంటూ కొన్ని హితవచనాలకు, లేదా ఆయన సేకరించుకున్న కొన్ని కోట్స్ పోస్టులు పెట్టుకుని ఉన్నా కొంత బాగుండేది. కానీ, తెలుగుదేశం పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకుని ట్వీట్లు పెట్టారు. మరి, ఈ క్రమంలో వైకాపా వాదనకు మద్దతు ఇస్తున్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తోందే..! పవన్ కూడా జగన్ మాదిరిగానే విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయం కలుగుతోందే. దీన్నెలా సమర్థించుకుంటారు..?
ప్రత్యేక హోదాపై మొదట్నుంచీ అత్యంత స్పష్టత ఉన్నది తనకి మాత్రమేనని చెబుతూ వచ్చిన పవన్… పార్లమెంటులో అదే అంశం చర్చకు వచ్చిన సందర్భంలో స్పష్టంగా స్పందించలేకపోయారు! అయిపోయాక… ఇప్పుడు ప్రజల్ని మేలుకొలుపుతా, ఈసారి యాత్రలో ఏవో చెబుతా, ఢిల్లీకి వినిపించేలా ఏదో చేస్తా, మడమ తిప్పేది లేదూ… ఇలాంటి ప్రకటనలు ద్వారా ప్రజలకు పవన్ ఏం చెబుతున్నట్టు..?