ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్, పవన్ కళ్యాణ్ ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. టిడిపి జనసేన కుమ్మక్కయ్యాయని పనిగట్టుకుని రోజుల తరబడి సాక్షి పేపర్, సాక్షి ఛానల్ చేసిన ప్రచారాన్ని కొంతమంది కాకపోతే కొంతమందైనా నమ్మారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో ఎక్కడికెళ్లినా ఒక యాక్టర్, ఒక యాక్టర్ అంటూ పవన్ కళ్యాణ్ పేరు కూడా ఎత్తకుండా చులకనగా చేస్తూ మాట్లాడుతున్న వైయస్ జగన్ కి పవన్ కళ్యాణ్ ధీటుగా సమాధానం ఇచ్చారు. “అవును నేను యాక్టర్ ని. కానీ నీ లాగా జనాల సొమ్ము తిని ఏడాది పాటు జైల్లో కూర్చోలేదు ” అంటూ పవన్ కళ్యాణ్ జగన్ పై విరుచుకు పడుతుంటే జనాల నుండి విపరీతమైన స్పందన వచ్చింది.
గిద్దలూరు లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్, తనమీద జగన్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఒక యాక్టర్ అంటూ పేరెత్తకుండా జగన్ చేస్తున్న విమర్శల పై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్, జగన్ చీకటి పొత్తులపై కూడా స్పందించారు. “నేను నేరుగా 2014లో టిడిపితో బిజెపితో పొత్తు పెట్టుకున్నాను. నీలాగా బిజెపితో కేసీఆర్తో చీకటి పొత్తు లు పెట్టుకోలేదు. కేసుల నుండి విముక్తి కోసం నీలాగా మోడీ కాళ్ల మీద పడలేదు” అంటూ పవన్ కళ్యాణ్ జగన్ మీద ధ్వజమెత్తాడు. మోడీ కాళ్ల మీద పడడం ద్వారా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని జగన్ దెబ్బ తీశాడు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు.
ఇప్పటికే కెసిఆర్ తో జగన్ చీకటి బంధాన్ని పవన్ కళ్యాణ్ పదేపదే ఎత్తిచూపిన తర్వాత, వేరే ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో జగన్ కెసిఆర్ తో తనకు బంధం ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్, జగన్ జైలు జీవితాన్ని గుర్తుచేస్తూ వైయస్సార్సీపి నీ ఇరకాటపెడుతున్నారు. ఎక్కడా మీడియాలో పవన్ కళ్యాణ్ వార్తలు రాకపోయినప్పటికీ పవన్ సభలకు జనం మాత్రం విపరీతంగా రావడమే కాకుండా పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా ప్రజలకు చేరిపోతున్నాయి. మరి పవన్ చేస్తున్న విమర్శలను జగన్ ఏ విధంగా తిప్పికొడతాడో వేచి చూడాలి