వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇది మంచిప్రభుత్వమే కానీ మెదక ప్రభుత్వం కాదన్నారు. ఏలూరు జిల్లాలో సిలిండర్ల పథకాన్ని ప్రారంభించిన తర్వాత పవన్ కల్యాణ్ మాట్లాడారు. లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా చెబుతున్న భవిష్యత్తులో వైసీపీ వాళ్ల నోటి నుంచి ఇంకేమీ రాకుండా చేస్తా. ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు. యుద్ధం కావాలనుకుంటే యుద్ధమే ఇస్తాం.. గొడవే కావాలంటే అభివృద్ధికి పాటుపడే గొడవ ఇస్తామని హెచ్చరించారు. వైసీపీ చేసిన తప్పుడు విధానాల వల్ల వ్యవస్థ పాడయింది.. వైసీపీ ఓడి 11 సీట్లు మిగిలిన వాళ్ళ నోళ్లు మూతపడటం లేదని మండిపడ్డారు.
ఆడపిల్లల మాన, ప్రాణాలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడటమే లక్ష్యమని తెలిపారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పవన్ సూచించారు. తాము ఎవరికీ అన్యాయంగా ఎదురు తిరగలేదు.. ఆడబిడ్డల గురించి, ఇంటి ఆడపడుచుల గురించి అసభ్యంగా మాట్లాడలేదని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారి కాళ్లు విరగ్గొట్టి కింద కూర్చోబెడతానని హెచ్చరించారు. జగన్ సొంత సోదరి ఆయన నుంచి రక్షణ కోరుకుంటోందని.. తాము కల్పిస్తామన్నారు.
పదవి వచ్చాక పదింతలు ఎక్కువగా కష్టపడే వ్యక్తిని అని అన్నారు. అభిమానులు సినిమా పేర్లు జపించడం కంటే భగవన్నామస్మరణ చేస్తే ఇంకా బాగుంటుంది.. సినిమాలో ఒక సరదా మాత్రమే.. సినిమాలు ఉండాలని సూచించారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదని నోటీసులు ఇచ్చి పంపేస్తున్నారన్న ధైర్యంతో వైసీపీ సోషల్ మీడియాలో కొంత మంది రెచ్చిపోతున్నారు. వారిని ఉద్దేశించి పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు.