జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబుతో మరోసారి సమావేశం అయ్యారు. ఏపీలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పవన్ కల్యాణ్ చంద్రబాబును కలవడం ఇది మూడో సారి. ఓ సారి విజయవాడ హోటల్లో కలిశారు. అప్పుడు చంద్రబాబే పవన్ వద్దకు వెళ్లారు. తర్వాత పవన్ కల్యాణ్.. చంద్రబాబు ఇంటికి వచ్చారు. ఇప్పుడు మరోసారి వచ్చి సమావేశం అయ్యారు. పవన్ .. చంద్రబాబు ఇంటికి వచ్చే వరకూ ఈ విషయం ఎవరికీ తెలియదు.
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రెండు పార్టీలు కలిసి పని చేసే అంశంపై వీరిద్దరూ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాత ఏపీలో రాజకీయ మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో వీరి భేటీ హాట్ టాపిక్‌గా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమతోనే ఉన్నారని బీజేపీ నేతలు పదే పదే ప్రకటిస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీతోనే ఉన్నామని చెబుతున్నారు కానీ కలిసి పోటీ చేస్తామన్న విషయంపైనా క్లారిటీ ఇవ్వడం లేదు. కేంద్ర బీజేపీ నేతలతో మాట్లాడుతున్నారు కానీ రాష్ట్ర నేతలతో సంప్రదించడం లేదు.
బీజేపీ … జనసేనతో మాత్రమే కలిసి పోటీ చేస్తామని చెబుతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని ప్రకటిస్తున్నారు. వైసీపీ విముక్త ఏపీ కోసం ప్రయత్నిస్తున్నామని ఓట్లు చీలికను అంగీకరించబోమని అంటున్నారు. ఇలాంటి సమయంలో.. జనసేన, టీడీపీ మధ్య సంప్రదింపులు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రెండు పార్టీలు కలిసి పని చేయడం ఖాయమన్న అభిప్రాయం ఈ వరుస భేటీతో రాజకీయవర్గాల్లో ఏర్పడుతోంది.