జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు. ఫాతిమా కళాశాల విద్యార్థులను ఆదుకోవాలంటూ సుదీర్ఘంగా ఓ ట్వీట్ పెట్టారు. ఇదే సందర్భంలో విద్యా వ్యవస్థ మీద, విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వాలు స్పందిస్తున్న తీరు మీద పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒక గంట సమయం దుర్వినియోగమైతే భవిష్యత్తు తరాల వారికి దురదృష్టానికి కారణమౌతుంది’ అంటూ నెపోలియన్ కొటేషన్ తో లేఖను మొదలుపెట్టారు. అలాంటి దురదుష్టాన్ని ఫాతిమా విద్యార్థుల జీవితంలోకి ఉద్దేశపూర్వకంగా తెస్తున్నారంటూ కాలేజ్ యాజమాన్యంపై మండిపడ్డారు. ఎన్నో కష్టాలుపడి ప్రవేశ పరీక్షలు రాసి, పాసైన విద్యార్థుల మొరలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంతకాలంగా పట్టించుకోవడం లేదన్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే పరిస్థితి వేరేలా ఉంటుందన్నారు. ఇదే పరిస్థతి ఇతర దేశాల్లో ఉంటే ఈపాటికే ఫాతిమా యాజమాన్యానికి కఠిన శిక్ష విధించేవారనీ, భారీ మొత్తంలో నష్ట పరిహారం వసూలు చేసేవారనీ, కాలేజీ లైసెన్స్ ను ఈపాటికే రద్దు చేసేవారని పవన్ కల్యాణ్ చెప్పారు. బలహీనుల విషయంలో సమర్థంగా పనిచేసే మన న్యాయ వ్యవస్థ, ఇలాంటి తప్పులు చేస్తున్నవారు, చట్టాన్ని ఉల్లంఘించేవారి విషయానికి వచ్చేసరికి మాత్రం క్రియాశీలంగా వ్యవహరించలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వాలకు విద్యావ్యవస్థ పట్ల అజమాయిషీ ఉండాలనీ, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన బాధ్యత వారికి ఉందని పవన్ అన్నారు. ఫాతిమా కాలేజీ విద్యార్థు విషయంలో ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా ఎందుకు వ్యవహరించడం లేదో దేవుడికే తెలియాలనీ, ఒకవేళ వచ్చే ఎన్నికలకు సిద్ధం అయ్యే పనిలో బిజీగా ఉన్నారేమో తనకు తెలీదంటూ నిర్వేదం వ్యక్తం చేశారు.
ఫాతిమా విద్యార్థులకు అండగా ముఖ్యమంత్రి నిలవాలనీ, అన్ని రకాలుగా నష్టపోయిన వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని పవన్ కోరారు. యాజమాన్యం బాధ్యతారాహిత్యం వల్ల బలౌతున్న స్టూడెంట్స్ కు న్యాయం జరిగేలా చేయాలని పవన్ కల్యాణ్ తన సుదీర్ఘమైన ట్వీట్ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కోరారు. మొత్తంగా పవన్ కల్యాణ్ ట్వీట్ సారాంశం ఇది. మరి, దీనిపై ఏపీ సర్కారు స్పందన ఎలా ఉంటుందో చూడాలి.