జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభ బాగా సక్సెస్ అయింది. పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీలో, అలాగే ఆ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో లక్షలాది మంది పాల్గొనడం రాజకీయ పార్టీలను ఆశ్చర్యచకితుల్ని చేసింది. అయితే గుంటూరు లో నిర్వహించిన పార్టీ కార్యాలయం ప్రారంభం, భారీ ర్యాలీ, బహిరంగ సభ – ఇవన్నీ సక్సెస్ కావడం వెనుక ఉన్న వ్యక్తి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐఏఎస్ అయిన తోట చంద్రశేఖర్ . ఇప్పుడు ఈయనని గుంటూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
మాజీ ఐఏఎస్ ఐన తోట చంద్రశేఖర్ ప్రజారాజ్యం పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి 2014లో ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి గుంటూరు ఎంపీగా పోటీ చేయనున్నారు. ఇప్పుడు గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ మళ్లీ పోటీ చేస్తే కనుక ఆయన తో తోట చంద్రశేఖర్ తలపడాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ తోట చంద్రశేఖర్ యొక్క గత రెండు ఓటములను కూడా ప్రస్తావించారు. 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసినప్పుడు ఆయన గెలిపించుకోలేక పోయామని, అలాగే 2014లో పొత్తు లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి మాగంటి బాబు కు తాను స్వయంగా ప్రచారం చేసి పరోక్షంగా తోట చంద్రశేఖర్ ఓటమికి కారణం అయినట్టుగా మాట్లాడుతూ ఈసారి జనసైనికులు అంతా కలిసి తోట చంద్రశేఖర్ ని గెలిపించాల్సిందిగా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
మహారాష్ట్రలో ఎంతో పేరు వచ్చినా, తెలుగు మీడియా పట్టించుకోని తోట చంద్రశేఖర్:
కొంతమంది మాజీ ఐఏఎస్లకు తెలుగు మీడియాలో బాగా ప్రచారం లభిస్తుంది. అయితే తోట చంద్రశేఖర్ విషయానికి వస్తే, ఆయనకు కూడా వాళ్లలాగే బలమైన ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ మన మీడియా ఎందుకో ఆయనను ఎప్పుడు హైలెట్ చేయలేదు. మహారాష్ట్రలో పనిచేసిన తోట చంద్రశేఖర్ గురించి అక్కడి స్థానిక పత్రికలలో అప్పట్లో గొప్ప గొప్ప కథనాలు వచ్చాయి. కానీ ఆ కథనాల గురించిన ప్రస్తావన కూడా తెలుగు మీడియాలో ఎందుకనో రాలేదు.
ప్రత్యేకించి, థానే మున్సిపల్ కమీషనర్ గా పని చేసినప్పుడు అక్కడ దాదాపు 20 వేల అక్రమ నిర్మాణాలని కూల్చివేసి రోడ్లు వెడల్పు చేయడమే కాకుండా, కబ్జాలకి గురైన 15 చెరువుల్ని పునరుద్ధరించారు. థానే నగరాన్ని క్లీన్ సిటీగా మార్చారు. ఆయన థానే నుంచి ట్రాన్స్ ఫర్ అయి వెళ్లిపోతుంటే, ఆయన్ని కొనసాగించాలి అంటూ ప్రజలు మూడు రోజులు స్వచ్చందంగా బంద్ పాటించినట్లు మహారాష్ట్ర స్థానిక పత్రికలు రాశాయి. అలాగే నాగపూర్ లో కూడా ఆయన చేసిన కృషిని ఆయన ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోయిన తర్వాత చాలా సంవత్సరాలకు కూడా అక్కడి పత్రికలు మళ్లీ నాగపూర్ కి తోట చంద్రశేఖర్ అలాంటి అధికారులు అవసరం ఉంది అంటూ వ్యాసాలు రాశాయి. ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్ ఫర్ ఎక్సెలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అవార్డు తో పాటు అనేక ప్రభుత్వ అవార్డులు పొందిన తోట చంద్రశేఖర్ గురించి తెలుగు పాఠకులకు తెలిసింది తక్కువే. కారణం, మన తెలుగు అగ్ర పత్రికల్లో , మన చానళ్లలో ఎప్పుడు ఈయన గురించి కథనాలు రాలేదు.
కొంతమంది జనసైనికులు మాత్రం అలా జరగడానికి కారణం మీడియాకు సైతం పాకిన ‘సామాజిక వర్గ’ కోణం అని మండి పడుతూ ఉంటారు. కేవలం జనసేనలో చేరిన తర్వాత మాత్రమే ఈయన గురించి తెలుగు చానల్లో కథనాలు వచ్చాయి. ఆ వచ్చిన కథనాలు కూడా ఈయన గురించి నెగటివ్ గా, ఈయన సంస్థ అయిన ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ మీద ఉన్న ఒకటి ఆరా కేసు లని హైలెట్ చేస్తూ వచ్చినవే.
రాజకీయ ప్రస్థానం:
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం ద్వారా రాజకీయ ప్రవేశం చేశాడు తోట చంద్రశేఖర్. ప్రజారాజ్యం కోసం కోసం అప్పట్లో ఈయన భారీ స్థాయిలో డబ్బు కూడా ఖర్చు చేశారు. ప్రజారాజ్యం పార్టీ తరపున 2009లో ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఇక ప్రజారాజ్యం విలీనం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం తో వైకాపాలో చేరి 2014 ఏలూరు ఎంపీగా పోటీచేసి, మాగంటి బాబు పై ఓడిపోయారు.
అయితే పవన్ కళ్యాణ్ జాయింట్ ఫాక్ట్స్ ఫైండింగ్ కమిటీ పెట్టి కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల గురించి నివేదిక ఇచ్చారు. అప్పుడు ఆ కమిటీలో లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ, ఉండవల్లి , పద్మనాభయ్య తో పాటు చంద్రశేఖర్ కూడా ఉన్నారు. ఆ కమిటీ సమయానికి ఆయన వైఎస్సార్ సీపీ పార్టీలో ఉన్నప్పటికీ ఆ కమిటీలో పాల్గొన్న మరుక్షణం నుంచే త్వరలో జనసేనలోకి రానున్నారని ఊహా గానాలు మొదలయ్యాయి. ఊహా గానాలు నిజం చేస్తూ ఆ తర్వాత జనసేన లో చేరారు. జనసేన పార్టీకి మీడియా బలం బొత్తిగా లేకపోవడంతో, తానే సొంతంగా 99 టీవీ ఛానల్ ని చేజిక్కించుకుని, పవన్ కళ్యాణ్ కి అంతో ఇంతో మీడియా కవరేజ్ ఇస్తున్నారు.
2019లో గెలుస్తాడా?
ఈసారి కూడా ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తాడేమోనని చాలామంది భావించినప్పటికీ, పవన్ కళ్యాణ్ తనను గుంటూరు అభ్యర్థిగా ప్రకటించారు. అటు టిడిపి నుంచి గల్లా జయదేవ్, ఇటు వైసీపీ నుంచి కిలారు పోటీ చేస్తున్న (ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు) ఈ స్థానంలో, తోట చంద్రశేఖర్ బలమైన అభ్యర్థి గానే కనిపిస్తున్నాడు. అయితే మరి గత రెండు ఎన్నికల్లో చేతికందని విజయం ఈసారి అందుతుందా అన్నది తెలియాలంటే మరికొద్ది నెలలు ఆగాలి
– జురాన్ ( CriticZuran)