ప్రజారాజ్యం సమయం లో అల్లు అరవింద్ పై వచ్చినన్ని విమర్శలు మరెవరిపైనా రాలేదు. ఆ పార్టీ ఓడిపోయాక కూడా అల్లు అరవింద్ పెత్తనం కారణంగానే టికెట్స్ ఎవరికి పడితే వారికి ఇచ్చారని దానివల్లే పార్టీ ఘోరంగా ఓడిపోయిందని పీఆర్పీ అభిమానులు విమర్శించేవారు. అయితే దానికి అల్లు అరవింద్ వెర్షన్ మరోలా ఉండేది. అప్పట్లో ఆయన ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, చిరంజీవి గారి మీదకి బుల్లెట్ వస్తే దానికి అడ్డం నిలబడే వ్యక్తులం తామేనని అన్నారు. అయితే ఇప్పుడు తొలిసారిగా పవన్ అల్లు అరవింద్ మీద బహిరంగాంగా అసంతృప్తి ని వ్యక్తం చేసారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంపై రాజమండ్రిలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘పార్టీని విలీనం చేయడం చిరంజీవిగారి తప్పే అనుకోండి. కానీ అన్నయ్య పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తుంటే ఎందుకు నిశ్శబ్ధంగా ఉన్నాను అంటే.. నేనేప్పుడు ఒక నాయకుడిని నమ్ముతాను. ఒక కెప్టెన్ షిప్‌ని నడుపుతున్నప్పుడు.. ఆ నాయకుడిగా అన్నీ తెలుసు. అందుకే ఆ నాయకుడిని నేను అనుసరిస్తా. నాకేం తెలియక కాదు. కాకపోతే నేను నిస్సహాయుడ్ని. ఇప్పుడైతే నాకు బలం ఉంది. అనుభవం తర్వాత వచ్చింది. ఆరోజు నేను చెబితే వినేలా లేదు. ఉదాహరణకి అల్లు అరవింద్ గారు అన్నారు. పవన్ కల్యాణ్‌ని ఫలానా చోటకి ప్రచారానికి పంపించండి అంటే.. ఎందుకండీ.. మనకు అల్లు అర్జున్ ఉన్నాడుగా, రామ్‌చరణ్ ఉన్నాడుగా.. పంపించేయండి అన్నారు. అప్పుడు నాకనిపించింది. అప్పుడు నాకు అర్ధమైంది ఏమిటంటే అల్లు అరవింద్‌గారు నన్ను నటుడిగానే చూశారు. తన కొడుకుతో పాటు, తన మేనల్లుడితో పాటు పవన్ కల్యాణ్ అనే వాడు ఒక నటుడంతే. అంతేగానీ, వారికి నాలో ఉన్న సామాజిక స్పృహ మాత్రం కనిపించలేదు. ఇలాంటి వాతావరణంలో ఇంక నేను ఏం మాట్లాడితే ఎవరు వింటారండి? అందుకనే చేతులు కట్టుకుని రోధించేవాడ్ని. కన్నీళ్లు కూడా బయటికి వచ్చేవి కావు’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
పవన్ మాట్లాడుతున్న మాటల్లో నిజం ఉండి ఉండవచ్చు కానీ ఇప్పుడు అందరూ మర్చిపోయిన ఈ అల్లు అరవింద్ ప్రస్తావన ఎందుకనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. పైగా పవన్ లోని సామాజిక స్పృహ ని కనిపెట్టలేకపోవడం అరవింద తరపున నుంచి పెద్ద తప్పు కూడా కాదు. రేపు ఎప్పుడైనా అల్లు అరవింద్ ని ఎవరైనా దీని గురించి అడిగినా, తాను పవన్ తో జానీ అనే సినిమా చేసానని, ఆ సమయం లో పవన్ ఎప్పుడూ సైలెంట్ గా తన పని తాను చేస్కుంటూ ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఉండేవాడని, ఎక్కువ గా మాట్లాడేవాడు కాదనీ, ఆయన మాట్లాడకపోవడం వల్ల, చెప్పకపోవడం వల్ల ఆయన మనసులో ఉన్న సామాజిక స్పృహ తనకి తెలిసే అవకాశం లేదని సింపుల్ గా తేల్చినా ఆశ్చర్యం లేదు.