ప్రత్యేక హోదాపై తెదేపా ఎంపీలు గట్టిగా కృషి చేయడం లేదని ట్వీట్టర్లో విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్ మళ్ళీ చాలా రోజుల తరువాత ఈ అంశంపై స్పందించారు. “గౌరవ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి విభజన సమయంలో ఆంద్రప్రదేశ్ కి జరిగిన అన్యాయాన్ని, ప్రజలకి తగిలిన గాయాల్ని గతంలో వివరించాను. ఆయన అర్ధం చేసుకొన్నారు. అందుకే ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకొంటుందనే భావిస్తున్నాను…ఇప్పటికే ఆలశ్యమైందని తెలుసు, కానీ దేశ సమగ్రతని దృష్టిలో పెట్టుకొని భావోద్వేగాలకు పోకుండా ఇంకొంతకాలం వేచి చూద్దాం. అప్పటికీ న్యాయం జరుగని పక్షంలో దానిని ఎలా సాధించుకోవాలో ఆలోచిద్దాం,” అని ట్వీట్ చేసారు. ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా ఈరోజు రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్ మరికొన్ని రోజులు వేచి చూద్దాం అని చెప్పడం చూస్తే ఆయన కూడా ఈ బంద్ ని వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మరి దీనిపై వైకాపా ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.