ఓట్ల కోసం చాలా మంది పాదయాత్రలు చేశారు కానీ… ఇప్పుడు రైతుల కోసం పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో వ్యాఖ్యానించారు. లోతుగా విశ్లేషణ చేసి రైతు సమస్యలపై పోరాటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఆయన ప్రకటించారు. మండపేటలో జనసేన తరపున రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల పొట్టకొడితే ప్రభుత్వం కూలిపోతుందని పవన్ హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేలు రైతుల రక్తం కూడు తింటున్నారనిమండిపడ్డారు. అసెంబ్లీలో రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే.. ఈ నెల 12న కాకినాడలో నిరాహార దీక్ష చేస్తానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించారు. ముద్దులు పెట్టి కౌగిలించుకుంటే రైతుల కడుపులు నిండవని, ఓట్ల కోసం డబ్బులు ఇస్తారు కానీ.. రైతు కన్నీళ్లు తుడిచే ప్రభుత్వాలు లేవని మండిపడ్డారు.
ఉభయగోదావరి జిల్లాలో రైతులను సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. మిల్లర్ల నుంచి బియ్యం సేకరిస్తున్న ప్రభుత్వం వారికి తగిన చెల్లింపులు చేయడం లేదు. అలా అడిగిన వారిపై.. విజిలెన్స్ సోదాలు చేయిస్తామని బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ పర్యటన… రాజకీయవర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. చాలా రోజులుగా రైతులకు బాకీ ఉన్న సొమ్ములను ప్రభుత్వం నిన్నటి వరకూ విడుదల చేయలేదు. పవన్ పర్యటనకు ఒక్క రోజు ముందు.. ధాన్యం సేకరణ నిధులు రూ. ఎనభై కోట్లను వారి ఖాతాల్లో వేసింది. ఇంకా పెద్ద ఎత్తున రైతులకు ధాన్యం నగదు చెల్లించాల్సి ఉంది.
పాదయాత్ర చేస్తానని నేరుగా పవన్ కల్యాణ్ ప్రకటించకపోయినప్పటికీ.. ఆయన దృష్టిలో ఆ ప్లాన్ ఉందన్న విషయం మాత్రం అర్థమవుతోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజానికి గతంలో అనంతపురం కరువు మీద.. పాదయాత్ర చేస్తానని కూడా పవన్ ప్రకటించారు. అయితే.. కార్యాచరణలోకి రాలేదు. కొద్ది రోజుల కిందట.. ఇసుక సమస్యపై లాంగ్ మార్చ్ చేస్తానన్నారు కానీ.. అభిమానుల తాకిడితో సాధ్యం కాలేదు. దానిపై వైసీపీ నేతలు సెటైర్లు కూడా వేశారు. పాదయాత్ర చేయాలన్న ఉద్దేశం పవన్ కు ఉంటే.. ఇలాంటి సమస్యలు ఏవీ అడ్డంకి కాలేవు. మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..!