జనసేన అధినేత పవన్ కల్యాణ్ అ.. ఆలు దిద్దుతున్నారు. అంటే ఆయన అక్షరాలు దిద్దుతున్నట్లు కాదు. రాజకీయ ప్రవేశానికి అనంతపురాన్ని ఎంపిక చేసుకున్న పీకే.. అక్షర క్రమంలో మొదటి అడుగు వేయనున్నారు. జిల్లాలో పట్టు పెంచుకోవడానికి సన్నాహాలు ప్రారంభిస్తున్నారు. ఆ జిల్లాలో పాదయాత్ర చేపట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. హిందూపురం నుంచి ప్రారంభమవుతుందని భావిస్తున్న పాదయాత్ర మూడు రోజుల పాటు సాగుతుంది. జిల్లావ్యాప్తంగా పర్యటించి, పార్టీని క్షేత్ర స్థాయి నుంచి పటిష్టం చేయాలనేది ఆయన వ్యూహంగా ఉంది. ఇదే నిజమైతే,. అనంతపురం జిల్లాలో రాజకీయాలు వేడెక్కడం ఖాయం. మొత్తం 14 స్థానాలలోనూ 12 స్థానాలను టీడీపీ గెలుచుకుంది. కదిరి ఎమ్మెల్యే వైయస్ఆర్ కాంగ్రెస్ నుంచి అధికార పార్టీలో్ దూకేశారు. ఉరవకొండ మాత్రమే ప్రతిపక్ష ఖాతాలో ఉంది. ఇక్కడ జనసేన పోటీ అధికార పార్టీకే లాభదాయకంగా పరిణమిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు జనసేనాని గెలుచుకునే అవకాశముంది. ఈ చీలిక కూడా టీడీపీకే లబ్ధి చేకూరుస్తుంది. దీని వల్ల నష్టపోయేది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఈసారి అన్ని స్థానాలనూ టీడీపీయే గెలుచుకున్నా ఆశ్చర్యం లేదు. చంద్రబాబు వ్యూహం కూడా ఇదే. జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్న ప్రాంతాలలో జనసేన అభ్యర్థులను పోటీచేయించి లబ్ధి పొదాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. నిజానికి ఈ వ్యూహం పాతదే. డాక్టర్ వైయస్ఆర్ 2009 ఎన్నికల్లో అనుసరించిందే. కాకపోతే అప్పుడు రెండు పార్టీలు.. లోక్ సత్తా, ప్రజా రాజ్యం పార్టీల అభ్యర్థులు ఓట్లను చీల్చి కాంగ్రెస్ గెలుపునకు మార్గాన్ని సుగమం చేశాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ ఆధ్వర్యంలో మహాకూటమి హోరాహోరీగా పోరాడినప్పటికీ వైయస్ఆర్ గెలుపును ఆపలేకపోయాయి. ఇదే వ్యూహాన్ని చంద్రబాబు ఇప్పుడు అమలులో పెడుతున్నారనుకోవచ్చు. రాజకీయాలంటే పేకాటలాంటిదే. జోకర్ పడితేనే ఆట సుళువవుతుంది. తాజా రాజకీయాల్లో టీడీపీ చేతిలో జోకర్ ఎవరో ఊహించడం అంత కష్టమేమీ కాదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే పీకే ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారనే విమర్శలకు ఇదే బలాన్ని చేకూరుస్తోంది.
డాక్టర్ వైయస్ఆర్ మొదలు పెట్టిన పాదయాత్రల సంస్కృతిని అనంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కొనసాగించారు. ఆ సమయంలో జగన్ జైలులో ఉన్నారు. పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యతను ఆమె తనపై వేసుకున్నారు. తదుపరి చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన పాదయాత్ర సంచలనమే. ఆ యాత్రలో ఆయన అన్ని వర్గాలనూ కలుసుకుని మద్దతు కూడగట్టుకున్నారు. పవన్ కల్యాణ్‌కు అధికారంలోకి రావాలనీ, సీరియస్‌గా రాజకీయం చేయాలనీ అభిలాష ఉంటే..పాదయాత్రను పూర్తిస్థాయిలో చేపట్టాలి. ఇది ఆయన పట్ల అభిమానుల్లో మరింత అనురక్తిని పెంచుతుంది. విజయానికి బాటలు వేస్తుంది. తనను నమ్ముకున్న వారికోసం సినిమాలకు పనిచేయాల్సిందేనని ఆయన తరచూ అంటుండడమే పీకే వైఖరి పట్ల అనుమానాలను రేకెత్తిస్తోంది. జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడానికి రాజకీయల్లోకి రానవసరం లేదు. చివరి నిముషంలో ఆయనకు పట్టున్న ప్రాంతాలలో సభలు నిర్వహిస్తే చాలు. ప్రజా సేవ.. సినిమాలా అనేది ఆయన తేల్చుకోవాలి. ఎన్టీరామారావు టీడీపీని స్థాపించిన తరవాత అనుసరించిన వైఖరి ఆయనకు ఆదర్శం కావాలి. ఇనుము వేడిగా ఉన్నప్పుడే అవసరమైన ఆకృతిలోకి మార్చుకోగలగాలి. ప్రజాభిమానమూ అంతే. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తించాలి.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి