చిరంజీవి అభిమానులందరూ పవన్‌కల్యాణ్‌ని అభిమానించాలని రూల్ ఏమీ లేదు. అలాగే, పవన్‌కల్యాణ్‌కి ఏర్పడిన ఫ్యాన్ ఫాలోయింగ్ చిరూని ఫాలో అవ్వాలనే రూల్ కూడా ఏమీ లేదు. స్మాల్ సైజ్ క్రికెట్ టీమ్ టైపులో మెగా ఫ్యామిలీలో అరడజనుమంది హీరోలున్నారు. కొత్తగా అల్లుడు కల్యాణ్ దేవ్ వస్తున్నాడు. అతణ్ణి పక్కన పెడితే… మిగతా మెగా హీరోల్లో ఎవరి స్థాయిలో వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. అదే సమయంలో ఫ్యామిలీలో అందర్నీ అభిమానించే ప్రేక్షకులు కొందరున్నారు. కొన్నేళ్లుగా వాళ్లందరికీ ఒక్కటే నిరాశ. మెగా హీరోల సినిమా వేడుకల్లో పవన్ ఎప్పుడు కనిపిస్తాడా? అని. ముఖ్యంగా రామ్ చరణ్ సినిమా వేడుకకు అతిథిగా ఎప్పుడు వస్తాడా? అని. అప్పుడెప్పుడో ‘నాయక్’ ఫంక్షన్ తరవాత మళ్లీ మెగా వేడుకలో పవన్ కనిపించలేదు.
పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి వచ్చినా… మెగా వేడుకలకు పవన్ వెళ్ళలేదు. ఈ మధ్యలో నితిన్ వేడుకలకు పవన్ హాజరయ్యాడు. ఆఖరికి ఎన్టీఆర్ సినిమాకి క్లాప్ కొట్టాడు. ఇటీవల తెలుగు హీరోలందరూ ఒకరి సినిమా వేడుకలకు మరొకరు వెళ్తున్నారు. మహేశ్ బాబు ‘భరత్ అనే నేను’ బహిరంగ సభకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై వారం కాలేదు. తరవాత మహేశ్ ఇచ్చిన పార్టీలో ఎన్టీఆర్, చరణ్ సందడి చేసి రెండ్రోజులు కూడా కాలేదు. ఇతర హీరోలతో అంత సఖ్యతగా వుంటున్నప్పుడు సొంత ఫ్యామిలీలో హీరోలు ఇంకెంత సఖ్యతగా వుండాలి? అనే ప్రశ్న రావడం సహజం. దీనికి తోడు హీరోలు అందరూ ‘రంగస్థలం’పై ప్రశంసల వర్షం కురుపిస్తుంటే… పవన్ ఇంకా సినిమాను ఎందుకు చూడలేదు? అనే ప్రశ్న వచ్చింది. వీటన్నిటికీ ‘రంగస్థలం’ చూడడంతో… సినిమా గురించి సక్సెస్ మీట్లో మాట్లాడతానని చెప్పడంతో… పవన్ సమాధానం ఇచ్చేసినట్టు అయ్యింది.
పవన్ కల్యాణ్ పర్ఫెక్ట్ టైమింగ్‌లో ‘రంగస్థలం’ సినిమా చూశాడు. అదీ స్పెషల్ షో వేయించుకోకుండా… థియేటర్లో ప్రేక్షకుల మధ్య చూశాడు. ‘తొలిప్రేమ’ తరవాత థియేటర్లో పవన్ చూసిన ఇదే కావడంతో చాలా కాలంగా థియేటర్లకు దూరంగా వున్న అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మొదలైంది. ఆల్రెడీ హిట్ టాక్, బంపర్ హిట్ వసూళ్లతో దూసుకువెళ్తున్న ‘రంగస్థలం’కి పవన్ ప్రశంసలు ఎక్స్ట్రా మైలేజీ ఇచ్చే విషయమే. ఇక, ‘రంగస్థలం’ ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి వచ్చారు. సక్సెస్ మీట్‌కి ఎవర్ని పిలవాలి? మళ్ళీ చిరంజీవి వస్తే పెద్ద ఆసక్తి వుండదు. ఆల్రెడీ ఆయన ప్రీ రిలీజ్లో సినిమా గురించి బోల్డంత మాట్లాడారు. సినిమాపై ప్రశంసలు కురిపించిన ఎన్టీఆర్‌ని పిలవాలంటే… మొన్నే మహేశ్ బాబు ‘భరత్ అనే నేను’కి వెళ్లాడు. మహేశ్‌ని పిలిస్తే కాదనకుండా వస్తాడు. కానీ, ఆయన సొంత సినిమా థియేటర్లలోకి త్వరలో రాబోతుంది. అక్కడ ‘రంగస్థలం’తో పాటు ఆయన సినిమా గురించి కూడా మాట్లాడాలి. భారీ విజయానికి తగ్గట్టు భారీ ఇమేజ్ వున్న హీరో వస్తే బాగుంటుందని అనుకుంటున్న తరుణంలో అబ్బాయ్‌కి బాబాయ్ అభయం ఇచ్చేసాడు.
పవన్ కల్యాణ్ డేట్స్ అడ్జస్ట్ చేయడాన్ని బట్టి ఈ వారాంతంలో లేదా వచ్చే వారంలో హైదరాబాద్ లేదా అమరావతిలో ‘రంగస్థలం’ సక్సెస్ మీట్ నిర్వహించాలని అనుకుంటున్నారు.