వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ దిశగా పార్టీ నిర్మాణం జరుగుతోందనీ, అది పూర్తయ్యే వరకూ ఈ మధ్య కాలంలో జరిగే ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయడంగానీ, ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం కానీ ఉండదని ఆ మధ్య స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ నుంచి పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి పెడతానని కూడా చెప్పారు. పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా జనసేన సోషల్ మీడియా టీమ్ తో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. పార్టీ విధివిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ టీమ్ పనిచేస్తుంది. దీనికి ‘శతఘ్ని’ అని పేరుపెట్టారు. ఈ సందర్బంగా ఆ టీమ్ అడిగిన కొన్ని ప్రశ్నలకు పవన్ కల్యాణ్ జవాబులు ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. ఇప్పటికి ఇప్పుడే 175 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పలేనని, 2018 డిసెంబర్ లో ఆ నిర్ణయం తీసుకుంటానని పవన్ చెప్పారు. పార్టీ బలమేంటో, వాస్తవంగా మన సామర్థ్యం ఏంటో అనేది అప్పుడు ఓ అంచనా వేసుకున్నాకనే ఎన్ని స్థానాల్లో పోటీకి దిగాలనే నిర్ణయం ఉంటుందని పవన్ వివరించారు. రాజకీయ ప్రక్రియ అంటే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యం కాదనీ, సామాజిక మార్పు కోసం కృషి చేయాలనేది తన ఆశయం అన్నారు. ఈ ప్రక్రియలో పదవి అనేది ఒక భాగం మాత్రమే అన్నారు. ప్రజారాజ్యం పార్టీ అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకుని సాగాల్సిన పరిస్థితి తనకు ఉందన్నారు. నటుడిగా అడుగుపెట్టిన తొలిరోజునే ఈరోజు ఉన్న స్థాయికి చేరుకుంటావా అని అడిగితే చెప్పలేననీ, నడుచుకుంటూ వెళ్తేనే ఎక్కడికి చేరుకోగలమనేది తెలుస్తుందన్నారు. జనసేన పార్టీ కూడా అంతేననీ, తను కనీసం ఓ పాతికేళ్ల పాటు కష్టపడగలనని, దేశం కోసం సమాజం కోసం శ్రమించగలననే నమ్మకం ఉందన్నారు. జనసేన ఏ స్థాయికి వెళ్తుందీ ఎంతవరకూ చేరుకుంటుందీ అనేది వేసే ప్రతీ అడుగును బట్టీ ఉంటుందనీ, అందుకే పెద్దగా మాట్లాడేందుకు ఇష్టపడనన్నారు.
ఈ అక్టోబర్ నుంచి ప్రజల్లోకి వెళ్లిన తరువాత మన బలమేంటో అర్థమౌతుందనీ, ఆ తరువాతే వచ్చే ఎన్నికల్లో పోటీ అనేది ఏ స్థాయిలో ఉండాలనేది నిర్ణయించుకోగలమని పవన్ చెప్పారు. దీంతోపాటు తెలంగాణలో జనసేన కార్యకలాపాల విస్తరణ, ప్రత్యేక హోదా పోరాటం, తుందుర్రు ఆక్వాఫుడ్ ప్రాజెక్ట్ అంశాలపై కూడా పవన్ మాట్లాడారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీగా ప్రజా సమస్యలపై మన స్వరం వినిపిస్తున్నామనీ, లోటుపాట్లను ఎత్తి చూపిస్తున్నామనీ, వీటిపై పోరాడాల్సిన బాధ్యత ఎన్నోయేళ్ల అనుభవం ఉన్న ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఉంటుందని పవన్ చెప్పుకొచ్చారు.
పవన్ మాటల్ని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే… వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయడం అనేది అందరూ అనుకుంటున్నంత స్థాయిలో ఉండకపోవచ్చేమో! ఏవో కొన్ని స్థానాలకే పరిమితం కావొచ్చేమో! లేదూ, అప్పటికీ జనసేన పార్టీ నిర్మాణం పూర్తికాలేదని భావిస్తే… మరోసారి ‘అభివృద్ధి చేయగలిగే వారికే’ మద్దతు ఇస్తామని నిర్ణయం తీసుకోవచ్చేమో! ఇదో సుదీర్ఘ ప్రయాణం కాబట్టేమో, ముందుకు వెళ్తే తప్ప ఏం జరుగుతుందో అర్థం కాదేమో! పవన్ మాటల్లో పాతికేళ్ల విజన్ కనిపిస్తోందేమో. కానీ, ఆ ప్రయాణానికి కావాల్సిన బాటను నిర్మించుకునే ప్రణాళిక ఇంకా కనిపించడం లేదని అనొచ్చేమో.. కదా!