ఈ మధ్య ఒక మిత్రుడి ఆహ్వానంపై విజయవాడ వెళ్లినప్పుడు రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, వృత్తినిపుణులు కలిశారు. అనేక విషయాలు మాట్లాడారు. అయితే ఒక యువ మిత్రుడు కలసి ఫోటో తీసుకున్న తర్వాత ‘ఒక్క రిక్వెస్టు సార్!’ అన్నాడు.. ఏమంటే ‘మీరు బాగా మాట్లాడతారు గాని పవన్ కళ్యాణ్‌ను మరీ ఎక్కువగా విమర్శించకండి’ అని కోరాడు. ఆ మరుసటి రోజునే పవర్ స్టార్ మీడియాతో విస్తారంగా మాట్లాడుతూ తన ఆలోచనలు భవిష్యత్ ప్రణాళికలు బయిటపెట్టారు.
“చూడప్పా సిద్దప్పా వుంటే సినిమాల్లో వుండాలి.. లేకపోతే రాజకీయాల్లోకి రావాలి. ఈ సగం సగం వ్యవహారం వద్దప్పా” అని గత ఏడాది నవంబర్‌లో నేను సరదాగా చేసిన కామెంటు ఈ మధ్య టీవీ9 వారి 30 నిముషాల తర్వాత మరోసారి వీక్షకులను ఆకర్షించింది. హీరోకు గెస్ట్‌రోల్ వద్దప్పా అని కూడా నేనన్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వివరంగా మాట్లాడారు గనక మరోసారి వాటిని పరిశీలించుకునే అవకాశం వచ్చింది.
ఆయన స్పష్టత ఇచ్చిన విషయాలు కొన్నయితే దాటేసినవి మరికొన్ని. 2019 వరకే నటిస్తాను, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో స్వంతంగా పోటీ చేస్తాను. అన్నయ్య చిరంజీవిని ఆహ్వానించను. ఆర్థిక సమస్యలు పరిష్కరించుకోవాలి…ఇవీ ఆయన స్పష్టంగా చెప్పిన మాటలు. తనకు ఏడెనిమిది మూమెంట్సే వచ్చని వాటితో మేనేజ్ చేయడం తప్ప ఈ వయసులో జూనియర్లాగానో చరణ్లాగానో చేయలేనని కూడా నిజాయితీగా చెప్పేశారు.
సినిమాల సంగతి అలా వుంచితే రాజకీయాలకు సంబంధించి పవన్ మాటల సారాంశమేమిటి? మొదటిది మరో మూడేళ్ల వరకూ ఆయన రాజకీయాల్లోకి రారు. అప్పటి వరకూ సినిమాలే చేస్తారు. మరి మధ్య మధ్య రాజకీయాలు మాట్లాడరా? ఈ కాలంలో జనసేన పాత్ర ఏమిటి? అప్పటి వరకూ తెలుగుదేశంకు బిజెపికి సహకార పాత్ర కొనసాగించేట్టేనా? ఇంతవరకూ వంతపాడుతున్నట్టు కలిగిన అభిప్రాయం తొలగించబోరా? అసహనం వంటి అంశాలపై మౌనం పాటించడం, భారత మాతాకు జై అనడంలో తప్పులేదని చెప్పడం చూస్తే బిజెపి తో పవన్ దోస్తానా కొనసాగుతుందనుకోవాలి. జై అనడంలో తప్పుందని ఎవరూ చెప్పడం లేదు గాని అనకపోతే నేరమని దేశద్రోహమని చిత్రించడంపైనే చర్చ జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ దాన్ని మరో విధంగా చెప్పి దాటేయడం రాజకీయ కోణాన్ని తెల్పుతుంది.
వైసీపీ నుంచి చేర్చుకోవడంపై పరోక్ష విమర్శలు చేస్తూనే ప్రత్యేక హోదా వస్తుందనే ఆశాభావం ఇంకా వుందని సరిపెట్టారు. కనుక టిడిపికి దూరమై బిజెపికి దగ్గరవడానికి సంకేతాలుగా వీటిని చూడొచ్చు. బిజెపి కూడా పవన్ కళ్యాణ్ తమ పార్టీలో చేరతారని మొదట చెప్పినా ఆయన జనసేన పేరిట విడిగా వుంటేనే ఎక్కువ ఓట్లను ఆకర్షిస్తారని బావిస్తున్నది. బిజెపి నేతల కథనాలు కూడా అలానే వున్నాయి.
తెలంగాణపై ప్రేమ ప్రకటిస్తూనే రెండు రాష్ట్రాలు సాంస్కృతికంగా కలవలేవని మరో మాటన్నారు. ఇరు రాష్ట్రాల సుహృద్భావం గురించి ఇప్పుడు వినిపిస్తున్న మాటలకు భిన్నమైన ధోరణి ఇది. అంటే తాను తెలంగాణలో రాజకీయ జోక్యం చేసుకోబోనని చెప్పడం ఆయన ఉద్దేశంలా వుంది. చంద్రబాబు పాలనపై మాట్లాడకుండా తెలంగాణ ప్రభుత్వం బాగా చేస్తున్నదని కితాబునివ్వడంలోనూ అదే కనిపిస్తుంది. ఏతావాతా పవన్ కళ్యాణ్ 2019 దాకా సినిమాలు తీసేసుకుని తర్వాత రాజకీయాల్లోకి వస్తానని తేల్చేశారు. అప్పటిదాకా స్క్రీన్‌ప్లేలో మధ్య మధ్య గెస్ట్ అప్పియరెన్సులు లేకుండా చేస్తే ఒకె. వచ్చిననాడు తీసుకున్న విధానాలను బట్టి భవిష్యత్తు వుంటుంది.