ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదయినా ఒక సమస్య కనబడగానే కొమ్ములు తిరిగిన ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, అభిమానులు చివరికి రాజకీయ విశ్లేషకులతో సహా అందరూ పవన్ కళ్యాణ్ వైపు చూడటం ఒక అలవాటుగా మారిపోయింది. ప్రశ్నిస్తానన్న మనిషి పత్తా లేకుండాపోయాడని కొందరు విమర్శిస్తే, పవన్ కళ్యాణ్ ముందుకు వస్, ఆయన నేతృత్వంలో పోరాడటానికి సిద్దంగా ఉన్నామని మరి కొందరు ప్రకటిస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ దేనికీ స్పందించకుండా తన సినిమాల పని తను చూసుకొంటుంటారు. ఎప్పుడో ఏడాదికి ఒకమారు మీడియా ముందుకు వచ్చి తన అభిప్రాయాలు, ఆవేశాన్ని వెళ్ళగ్రక్కి మళ్ళీ మాయం అయిపోతుంటారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తీవ్ర సమస్య ఎదురయినప్పుడల్లా ఆయన శ్రీకృష్ణుడులాగ వచ్చి ఆదుకొని మాయం అయిపోతుంటారనే అపవాదు కూడా మూటగట్టుకొన్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ ప్రత్యేక హోదా వేడి, కరువు పరిస్థితులపై చర్చలు, ఆందోళనలు మొదలయ్యాయి కనుక అందరూ మళ్ళీ పవన్ కళ్యాణ్ వైపు చూడటం మొదలుపెట్టారు. అయితే రెండేళ్ళవుతున్నా తన పార్టీని ఏర్పాటు చేసుకోవడంలోనే అలసత్వం లేదా వైఫల్యం చెందిన పవన్ కళ్యాణ్, రాష్ట్ర సమస్యలన్నిటినీ పరిష్కరించగలరని ఆశించడం అత్యాశే అవుతుందని చెపితే ఆయన అభిమానులకు ఆగ్రహం కలుగవచ్చు. జనసేన పార్టీ ఆవిర్భావం మొదలుకొని నేటి వరకు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు చూస్తే, నేటికీ ఆయనలో రాజకీయ అపరిపక్వత కనిపిస్తూనే ఉంటుంది.
జనసేన పార్టీని పెట్టిన మొదట్లో అయన మాట్లాడిన మాటలు, వ్యవహార శైలికి నేటి వ్యవహార శైలికి చాలా స్పష్టమయిన తేడా కనిపిస్తోంది. ఆయన కూడా సాధారణ రాజకీయ నేతల మాదిరిగానే వ్యవహరిస్తున్నారు తప్ప ఎవరినయినా ప్రశ్నించే తెగువ, సమస్యల పరిష్కారం పట్ల ఆసక్తి, చిత్తశుద్ధి కనిపించడం లేదు. “హోదా గురించి ఎంపిలు పోరాడాలి కానీ నేను అడిగితే మోడీ ఇచ్చేస్తారా? హోదాపై నిర్ణయం తీసుకోవడానికి మోడీ ప్రభుత్వానికి మరికొంత సమయం ఇవ్వడం అవసరం,” వంటి మాటలు ఆయనలో వచ్చిన మార్పుకి అద్దం పడుతున్నాయి. దూరపు కొండలు నునుపుగా కనిపించినట్లుగానే రాజకీయాలు కూడా దూరం నుంచి చూస్తే ఒకలాగ, లోపలకి దిగి చూస్తే మరొకలాగ కనిపిస్తాయి. “పార్టీని నడిపించడానికి నా దగ్గర తగినంత డబ్బు లేదు..వచ్చే ఎన్నికల వరకు వీలయినన్ని సినిమాలు చేసి సంపాదించుకొని వస్తాను,” అని పవన్ కళ్యాణ్ చెప్పడం గమనిస్తే, ఆ చేదు నిజాన్ని ఆయన కూడా గుర్తించినట్లే ఉన్నారని స్పష్టం ఆవుతోంది.
కొమ్ములు తిరిగిన రాజకీయ నేతలు, అధికారులు సాధించలేని పనులను, ఎల్లప్పుడూ అనిశ్చిత వైఖరి ప్రదర్శించే పవన్ కళ్యాణ్ తీర్చుతారని ఆశించడం చాలా అత్యాశే అవుతుంది. ఒకవేళ అదే సాధ్యమయితే, ఆయన సోదరుడు చిరంజీవి తన ప్రజారాజ్యం ద్వారా ఎప్పుడో సాధించి ఉండేవారు కదా? అయినా అందరూ పవన్ కళ్యాణ్ వైపు ఎందుకు చూస్తున్నారంటే బహుశః తెదేపాకు ప్రత్యామ్నాయంగా కనబడుతున్న రాజకీయ పార్టీలపై అపనమ్మకం వలన కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ మానవత్వం, నిజాయితీ, సినిమా హీరోగా సంపాదించుకొన్న అభిమానం వలన కావచ్చు. తాము చేయలేని పనుల గురించి ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు కనుక ఆయనను కూడా ఈ రాజకీయ రొంపిలోకి లాగి ముందుకు త్రోసి నిలబెట్టి ఆయన పోరాటం విఫలం అయితే చూసి ఆనందించాలనే కోరికతో కావచ్చు లేదా ఆయన భుజంపై తుపాకులు పెట్టి తమ రాజకీయ ప్రత్యర్ధులతో పోరాడాలనే తపన వలన కావచ్చు లేదా ఆయనకున్న ప్రజాధారణతో అధికారం చేజిక్కించుకోవచ్చనే దురాశ కావచ్చు.
కానీ పవన్ కళ్యాణ్ తీరు, శక్తి సామర్ధ్యాలను నిశితంగా గమనించినట్లయితే ఒకవేళ ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో వచ్చినా ఎక్కువ కాలం నిలద్రొక్కుకోలేకపోవచ్చని చెప్పవచ్చు. పైగా అప్పుడు కూడా ఇలాగే అపరిపక్వంగా మాట్లాడుతూ, వ్యవహరించినట్లయితే ఉన్న మంచిపేరు కాస్తా కూడా పోగొట్టుకొని, అదనంగా అప్రదిష్ట, విమర్శలు మూటగట్టుకొనే ప్రమాదం ఉంటుంది.