నిజాయితీగా చెప్పాలంటే రాజకీయాల వరకూ మాత్రం చిరంజీవి చాలా మంచోడు. మంచివాళ్ళలో కూడా రెండు కేటగిరీలు ఉంటారు. సమర్థుడైన, అన్నీ తెలిసిన మంచివాడు ఒకరకం. ఏమీ తెలియని, అమాయకుడైన మంచివాడు రెండో రకం. చిరంజీవి ఈ రెండో రకానికి చెందిన మంచివాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, కెసీఆర్‌లు చేసిన తప్పులనే చిరంజీవి కూడా చేశాడు. టిక్కెట్స్ అమ్ముకోవడం, బాగా డబ్బున్నవాళ్ళకే సీట్లు ఇవ్వడం, ఓటర్లకు డబ్బులు పంచడం లాంటివి. కానీ మీడియాకు మాత్రం చిరంజీవి మాత్రమే కనిపించాడు. అప్పటివరకూ ఎవ్వరూ సీట్లు అమ్ముకోనట్టు, ఓటర్లకు డబ్బు పంచనట్టు, పార్టీల్లో గొడవలు లేనట్టుగా…అలాంటి దుర్లక్షణాలన్నింటినీ చిరంజీవే కొత్తగా అలవాటు చేస్తున్నాడు అనే రేంజ్లో మీడియా వార్తలు రాసేసింది. నాయకుడిగా చిరంజీవి చేసే చిన్న చిన్న తప్పులను భూతద్దంలో చూపింది. ‘జెండా పీకేద్దాం….’ అని వార్తలు వండివార్చింది. ఇక చిరంజీవి వ్యవహారం కూడా మరీ అమాయకంగా ఉండేది. మెగాస్టార్ చిరంజీవి మొదటిసారి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు అయితే మరీ స్కూల్ పిల్లాడు మాట్లాడినట్టు ఉంటాయి. చిరంజీవికి ‘రాజకీయం’ ఏమీ తెలియదు అని నిరూపించిన అలాంటి సంఘటనలు ఎన్నో. అన్నింటికీ మించి చిరంజీవి ఏం మాట్లాడినా నమ్మకంగా ఉండేది కాదు. అంతా కూడా డ్రామాలా ఉండేది. కేవలం నాలుకపై నుంచి వచ్చిన మాటల్లా ఉండేవి. వెండితెరపైన నటించిన స్థాయిలో రాజకీయాల్లో నటించలేకపోయాడు చిరంజీవి.
సినిమాకు 30 కోట్ల రెమ్యూనేషన్ తీసుకుంటున్నా సరే….డబ్బంటే నాకు చేదు అని చెప్పి ప్రజలను నమ్మించగలగాలి. ఫాం హౌస్‌లో సూపర్ డూపర్ హెల్తీ లావిష్ లైఫ్‌ని అనుభవిస్తున్నా సరే….సన్యాసిని అని ప్రజలను నమ్మించగలగాలి. సినిమా హీరోలు, హీరోయిన్స్ అందరూ కూడా ఫాం హౌసుల్లో ఉండడానికే ఇష్టపడతారు. కానీ ఆ ఫాం హౌస్ జీవితాన్ని సన్యాసి జీవితం అనే రేంజ్లో ప్రొజెక్ట్ చేసి ప్రజలను నమ్మించడం అంటే మాటలా? ఫైవ్ స్టార్ హోటల్ స్థాయిలో సౌకర్యాలు ఉండే ఐదు కోట్ల బస్సులో నిద్రించిన చంద్రబాబు…..ఏదో డొక్కు ఎర్రబస్సులో నిద్రించినట్టుగా ప్రజలను నమ్మించాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడు? ఈ ఫాం హౌస్ జీవితాన్ని సన్యాసి జీవితంగా ప్రజలను నమ్మించడం అంటే చంద్రబాబును మించి అని చెప్పుకోవాల్సిందే. ఇక చంద్రబాబును మించిన అవినీతి పరుడు లేడు అని 2009లో ప్రచారం చేసి…ఐదేళ్ళు తిరిగేసరికి చంద్రబాబు మొనగాడు అని చెప్పి నాలుక మడతెయ్యాలంటే….ఆ మడతేసిన విషయం ప్రజలకు తెలియకుండా మాయ చెయ్యాలంటే ఎంతటి రాజకీయ తెలివితేటలు ఉండాలి? ఆ స్థాయిలో తెలివితేటలు ఉండబట్టే ముప్ఫై ఏళ్ళుగా చంద్రబాబును మోస్తున్నప్పటికీ…ఆయనను ఏనాడూ కూడా దేవుడిగా తెలుగు ప్రజలకు చూపని ఈనాడు వారు పవన్ కళ్యాణ్‌ని మాత్రం దేవుడ్ని చేసేశారు. అంతకంటే ఎక్కువ స్థాయిలోనే భజన చేశారు. కెసీఆర్లాంటి రాజకీయ ఉద్ధండుడికి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బలమైన భజన మీడియాను దారికితెచ్చుకోవడానికి చాలా కాలమే పట్టింది. బోలెడంత అప్రతిష్ట కూడా మూటకట్టుకుంటూ అధికార బలం, ధనబలం ఉపయోగించిన తర్వాత కానీ పనవ్వలేదు. కానీ అధికారంలేకపోయినా కూడా, చంద్రబాబుకు పోటీగా రంగంలోకి దిగుతానని చెప్తున్నప్పటికీ కూడా ఆ బలమైన భజన మీడియా మొత్తం కూడా తన పల్లకీని మోసేలా పవన్ చేసుకుంటున్నాడంటే మామూలు విషయమా? ఇక 2009 నుంచి 2014 ఎన్నికల వరకూ కూడా తనను తిట్టిన అందరిచేతా పొగిడించుకునే విషయంలో కూడా సూపర్ సక్సెస్ అవుతున్నాడు పవన్. చంద్రబాబు, జగన్‌ల రాజకీయాన్ని అప్పుడే వంటపట్టించుకున్నాడు పవన్. చంద్రబాబుకు ఉన్న ఏకైక శతృవు జగన్ మాత్రమే. అలాగే జగన్‌కి కూడా చంద్రబాబు ఒక్కడే శతృవు. వాళ్ళిద్దరూ కూడా పరస్పరం తిట్టుకుంటూ ఉంటారు. ఇక దేశంలో ఉన్న మిగతా రాజకీయ నాయకులందరితోనూ సంబంధాలు బాగుండాలని కోరుకుంటారు. మరీ ముఖ్యంగా కెసీఆర్, కెటీఆర్లతో బాగుండడం కోసం చంద్రబాబు, జగన్‌లు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఓటుకు కోట్లు కేసు తర్వాత నుంచీ అయితే చంద్రబాబు పడుతున్న పాట్లు ఎన్నో. అదే పవన్ కళ్యాణ్‌ని చూడండి. జస్ట్ ఒక సినిమాలో పంచె కట్టాడు. కెటీఆర్‌ని ఫ్లాట్ చేశాడు. ట్విట్టర్లో కెటీఆర్, పవన్‌ల సెల్ఫీ చూసిన రాజకీయ నాయకులు కూడా ఆశ్ఛర్యపోయారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు సెల్ఫీ దిగారు. ఏం మంతనాలు చేసి ఉంటారు? ఇద్దరికీ అంత స్నేహం ఉందా? అని ఒకటే చర్చలు. ఎన్నో అనుమానాలు. అలాగే అభిమానుల అభిమానాన్ని పిచ్చి స్టేజ్‌కి తీసుకెళ్ళడంలో కూడా పవన్ తర్వాతే ఏ హీరో అయినా కూడా. కాటమరాయుడు ప్రి రిలీజ్ ఫంక్షన్లో ‘మీరే నా ప్రాణం’ అని చెప్పి అభిమానులను బానిసలుగా చేసే స్థాయి డైలాగ్ ఒకటి పేల్చాడు పవన్.
ఇవేవీ కూడా చిరంజీవికి చేతకాలేదు. రాజకీయ తెలివితేటలను ఒంటబట్టించుకోలేకపోయాడు చిరంజీవి. అందుకే రాజకీయాల్లో జీరోగా మిగిలిపోయాడు. కానీ అమాయకుడు అన్న ముద్ర మాత్రం మిగుల్చుకున్నాడు. అవినీతిపరుడు, ముఖ్యమంత్రి పదవికోసమే రాజకీయాల్లోకి వచ్చాడు, ప్రజాసేవ కోసం కాదు అని చెడ్డపేరు కూడా తెచ్చుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలు మాత్రం ఓవైపు చంద్రబాబుకి, మరోవైపు జగన్‌కి కూడా నిద్రలేకుండా చేస్తున్నాయి. చంద్రబాబు, కెసీఆర్, జగన్లకంటే కూడా చాలా చాలా నమ్మకంగా అబద్ధాలు చెప్పగలుగుతున్నాడు పవన్. డబ్బంటే ఇష్టం లేదు, పదవులు అంటే ఆశలేదు, చిన్న రైతులా బ్రతకాలనుకుంటాడు, నిద్రలో కూడా ప్రజలను అభివృద్ధి చేయడం ఎలా అని ఆలోచిస్తుంటాడు, కులం, మతం, రాజు-పేదలాంటి భేదాలను అస్సలు చూడడు అన్న ఇమేజ్ కోసం తహతహలాడని నాయకుడు ఎవడైనా ఉంటాడా? చంద్రబాబు, కెసీఆర్, చిరంజీవి, జగన్‌లు ఎవ్వరికీ కూడా ఆ ఇమేజ్ తెచ్చుకోవడం సాధ్యం కాలేదు. కానీ పవన్ సాధించాడు. అందుకే ‘రాజకీయం’ చేయడంలో చిరంజీవి జీరోగా మిగిలిపోయాడు. అసలు నిజాలు జనాలకు అర్థం కానంతవరకూ మాత్రం పవన్ కళ్యాణ్ హీరో. పొలిటికల్ రీల్ హీరో.