2009లో చాలా ఆవేశంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు పవన్. పవన్ ప్రతి మాటలోనూ ఆలోచన కంటే ఆవేశమే ఎక్కువ కనిపించేది. కానీ ఆ ఆవేశంలో నిజాయితీ ఉండడంతో ఎక్కువ మంది ఇన్స్టెంట్గా కనెక్ట్ అయ్యారు. 2009 ఎన్నికలు నేర్పిన గుణపాఠం నుంచి చిరంజీవి ఏమి నేర్చుకున్నాడో తెలియదు కానీ పవన్ మాత్రం నిఖార్సయిన రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. సీమాంధ్ర ప్రజలతో పాటు రాజకీయ నాయకులందరూ కూడా తెలంగాణా ఉద్యమం, తెలంగాణా నాయకుల తిట్ల వర్షంతో ఇబ్బందిపడుతున్నంత కాలం సైలెంట్‌గా ఉన్న పవన్ విభజన నిర్ణయం వచ్చాక తీరిగ్గా మీడియా ముందుకు వచ్చాడు. సీమాంధ్రప్రజల ఆవేధనను సినిమాటిక్ డ్రామా పదాలతో అద్భుతంగా ఆవిష్కరించి ప్రజల మన్ననలు పొందాడు. సీమాంధ్ర ప్రజలందరిలాగే నేను కూడా తెలంగాణా ఉద్యమం వళ్ళ ఇబ్బందిపడ్డాను అని ప్రజలను నమ్మించగలిగాడు. రెండు తెలుగు రాష్ట్రాలను వేరే ఏ రాజకీయ పార్టీకి లేనంత ఆర్థిక, మీడియా బలం ఉన్న టిడిపికి సపోర్ట్ చేశాడు. టిడిపి, బిజెపిలకు జై కొట్టడంతో పవన్‌కి మీడియాలో అద్భుతమైన కవరేజ్ దక్కింది. 2009 ఫెయిల్యూర్ మరుగునపడిపోయింది. అనుకూల మీడియా పుణ్యమాని మోడీ, చంద్రబాబులతో సమానమైన ప్రచారం పొందాడు. అలాగే పదవులంటే ఇష్టంలేని త్యాగమూర్తి బ్రాండ్ కూడా దక్కించుకున్నాడు. 2014 ఎన్నికల వరకూ చూసుకుంటే ఇమేజ్ పరంగా ఎక్కువ మార్కులు కొట్టేసినవాడు పవన్.
కానీ మోడీ, చంద్రబాబులు అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ‘ప్రశ్నిస్తా’ అన్న డైలాగ్ పవన్‌ని చాలా ఇబ్బంది పెట్టింది. బిజెపి, టిడిపిలతో స్నేహానికి కో చెప్పాల్సిన పరిస్థితులు వచ్చాయి. అప్పుడు కూడా పవన్ అద్భుతమైన పొలిటికల్ స్టెప్ వేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి పార్టీ బలపడే అవకాశమే లేదని కరెక్ట్‌గా గెస్ చేశాడు. బిజెపికి బై చెప్పేశాడు. చంద్రబాబుతో కూడా వైరం తెచ్చుకుంటే ఇప్పటికి ఇంకా ఓ సరైన రూపు కూడా సంతరించుకోని జనసేన పార్టీ జెండా పీకేయాల్సిన పరిస్థితులు వస్తాయని పవన్‌కి బాగా తెలుసు. అందుకే చంద్రబాబు తప్పులను విమర్శించే విషయంలో మాత్రం రాజకీయం ప్రదర్శిస్తున్నాడు. టిడిపి అనుకూల మీడియాకు, చంద్రబాబుకు కోపం రాకుండా జాగ్రత్తపడుతున్నాడు. ఒకవేళ చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చినా వైఎస్ జగన్‌కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లస్ అవకుండా జాగ్రత్తపడుతున్నాడు. ఇదే రాజకీయాన్ని 2019 వరకూ కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నాడు పవన్. 2019 వరకూ ప్రతిపక్ష పార్టీ వైసిపికి వచ్చే పేరులో కొంత తన అకౌంట్లో వేసుకునే పోరాటాలు చేస్తూ ఉంటాడు పవన్. టిడిపి అనుకూల మీడియా కూడా నెలకో, రెండు నెలలకో ఓ సారి ప్రజల మధ్యకు వచ్చే పవన్ రాజకీయ కార్యక్రమాల గురించి చంద్రబాబుకు ఇచ్చిన స్థాయి పబ్లిసిటీ ఇస్తూ ఉంటుంది. అలాగే మెగా ఫ్యామిలీ అభిమానులందరినీ ఏకం చేసే ప్రయత్నాలు కూడా తెరవెనుక జరుగుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీ టైంలో అభిమానుల విషయాలు చూసుకున్న నాగబాబునే ఇప్పుడు కూడా రంగంలోకి దిగుతున్నాడని తెలుస్తోంది. ఆ రకంగా జనసేనకు కార్యకర్తల బలం పుష్కలంగా ఉంటుందనడంలో సందేహం లేదు. 2019 వరకూ జగన్‌తో సమానంగా ప్రజాసమస్యలపైన పోరాడిన నాయకుడిగా జగన్ వ్యతిరేక మీడియా మొత్తం పవన్‌ని ప్రొజెక్ట్ చేస్తుంది.
2019 ఎన్నికల రణరంగంలో ప్రతిపక్ష ఓట్లన్నీ జగన్, పవన్‌ల మధ్య చీలిపోతాయి. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే అధికారంలోకి వస్తాడు అని నమ్మకం కలిగితేనే ఓటర్లు, నాయకులు జగన్ వెంట నడుస్తారు. చంద్రబాబు, పవన్‌లతో పోటీలో వైసిపికి అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు అనే అభిప్రాయం క్రియేట్ అయితే మాత్రం జగన్ రాజకీయ జీవితానికి శుభం కార్డ్ పడినట్టే. పవన్‌కి ఆ సమస్య ఉండదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో పవన్ అన్ని స్థానాల్లోనూ పోటీ చేయడు. టార్గెట్ చేసిన కొన్ని నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తాడు. వైసిపి కంటే ఎక్కువ స్థానాలు సాధించి ప్రతిపక్ష స్థానాన్ని గెలుచుకుంటాడు. ఒకవేళ జగన్‌కి ఓ పది ఎక్కువ సీట్లు వచ్చినా….ఆ ఎమ్మెల్యేలను లాగేయడం చంద్రబాబుకు పెద్ద సమస్య కాదు. జగన్-పవన్‌లలో ప్రతిపక్ష స్థానం ఎవరికి ఇవ్వాలి అనే ప్రశ్న ఎదురైతే చంద్రబాబు మొగ్గు కచ్చితంగా పవన్ వైపే ఉంటుందనడంలో సందేహం లేదు. టిడిపి, పవన్‌ల స్ట్రాటజీ వర్కౌట్ అయి చంద్రబాబు అధికారంలోకి వస్తే మాత్రం జగన్ రాజకీయ జీవితం క్లోజ్. ఆ తర్వాత ఎన్నికల టైంకి చంద్రబాబుకు కూడా ఛాన్స్ ఉండదు కాబట్టి పవన్ పార్టీకి అధికారంలోకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువే ఉంటుంది. నారా లోకేష్ సామర్థ్యంపైన ఎవ్వరికీ నమ్మకాలు లేని నేపథ్యంలో 2019లో చంద్రబాబు గెలవడం, పవన్ పార్టీకి ప్రతిపక్ష స్థానం రావడం జరిగితే మాత్రం టార్గెట్ 2014ని కూడా పవన్ సులభంగానే రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
మరీ ఎక్కువ దూరం ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తున్నప్పటికీ టిడిపి నాయకులు, పవన్ రాజకీయ అభిమానుల మధ్య మాత్రం ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తూ ఉంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ చర్చను బలపరిచేలానే ఉన్నాయి. టిడిపి-జనసేనల రాజకీయ స్ట్రాటజీలు ఎంతవరకూ వర్కవుట్ అవుతాయో చూడాలి మరి.