జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం ప్రజా పోరాట యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర ద్వారా జనసేన విధివిధానాలు, ప్రభుత్వాల వైఫల్యాలను ప్రచారంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, స్థానిక సమస్యలను నేపథ్యంగా చేసుకుని ప్రభుత్వాలను ప్రశ్నించాలని బయలుదేరారు. అయితే, పవన్ యాత్ర నాలుగో రోజు చేరేసరికి.. ఆయన ప్రసంగాల్లో ఆవేశం పాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధికార పార్టీకీ, ముఖ్యమంత్రికీ హెచ్చరికలు చేయడమో కాస్త ఎక్కువగా వినిపిస్తోందని చెప్పుకోవచ్చు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ… తనపై కిరాయి రౌడీలను అధికార పార్టీలు నాయకులు పంపించే ప్రయత్నం చేస్తున్నారనీ, కానీ.. తాము జన సైనికులం అన్నారు. ఇలాంటివారిని తరిమి తరిమి కొడతామన్నారు. బందూకులు ఉన్నాయేమోగానీ, తమ గుండెల్లో ధైర్యాన్ని తియ్యలేరని గుర్తుపెట్టుకోవాలన్నారు. తాను అన్నింటికీ తెగించిన వ్యక్తిననే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈరోజుకీ ఉద్దానం కిడ్నీ సమస్య అలానే ఉందన్నారు. తాను విదేశాల నుంచి వైద్యులను తీసుకొస్తే, ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నారు. ఆ సమస్యపై వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే, తాను దీక్షకు కూర్చుంటానని కూడా హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం జన సైనికులు పోరాటం చేస్తే, దాన్ని తెలుగుదేశం నాయకులు తూట్లుతూట్లు పొడిచారన్నారు. ఇప్పుడు, ధర్మ పోరాట దీక్షలంటూ ముఖ్యమంత్రి చేస్తుండటం తనకు చాలా బాధగా ఉందని పవన్ చెప్పారు. టీడీపీ చేస్తున్న ధర్మ పోరాట దీక్షను చిల్లుపడిన కుండలో నీళ్లు మోయడం లాంటిదని ఎద్దేవా చేశారు.
పెద్దగా ఆవేశపడననీ, ప్రతీ అంశంపై ఆచితూచి స్పందిస్తానని పవన్ కల్యాణ్ చాలాసార్లు గతంలో చెప్పారు. తాను సమస్యలపైనే మాట్లాడతాననీ, ఇతర అంశాలపై ఆవేశపడననీ అన్నారు. కానీ, తాజా సభలో పవన్ ప్రసంగంలో ఆవేశమే ఎక్కువగా కనిపించింది. బట్టలూడదీసి కొడతాం అన్నారు, జన సైనికుల్ని రెచ్చగొడితే తిరగబడతాం అన్నారు. తనపై దాడికి టీడీపీ రౌడీలు పంపిందని ఆరోపణలు చేశారు. తన ప్రతీ కదలికా, తన ప్రతీ మాట ఆచితూచి ఉంటాయని చెప్పుకునే పవన్… ఇప్పుడు తీవ్ర భావోద్వేగాలకు గురౌతున్నట్టుగా కనిపిస్తున్నారు. సమస్యల లోతుపాతుల గురించి మాట్లాడే పవన్… నేటి ప్రసంగంలో హెచ్చరికలూ, ఆవేశ ప్రదర్శననే ఎక్కువగా చేశారు. ప్రజలను ఆలోచింపజేయాలన్న ఉద్దేశంతోనే యాత్ర మొదలుపెట్టి, దాని స్థానంలో ఆవేశానికి పవన్ పెద్ద పీట వేసుకుంటూ పోతున్నారేమో అనిపిస్తోంది. ఈ తీరుని విశ్లేషించుకుంటే, తదుపరి సభల్లో మార్పు ఉంటుందేమో మరి..!