సినీ పరిశ్రమ సమస్యలపై పవన్ కళ్యాణ్ మాట్లాడగానే వైఎస్ఆర్సిపి మంత్రులందరూ వరస పెట్టి పవన్ కళ్యాణ్ పై ముప్పేట దాడి చేసిన సంగతి తెలిసిందే . అయితే పవన్ కళ్యాణ్ అక్కడితో ఆగకుండా వై ఎస్ ఆర్ సి పి పాలన వైఫల్యాలను ఎండగడుతూ సోషల్ మీడియా లో ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు. పైగా పాలన వైఫల్యాలపై తాము వేసిన పోస్ట్ కు ప్రతిస్పందనగా మంత్రులు మాట్లాడ లేకపోవడాన్ని ఎద్దేవా చేస్తూ ఇప్పుడు ఎక్కడ ఆ వైసిపి గ్రామ సింహాలు అంటూ ఆ పార్టీ నేతలను ఎద్దేవా చేస్తున్నారు.
వైఎస్ఆర్ సీపీ నేతలు తనపై దాడి మొదలెట్టగానే, దానికి ప్రతిస్పందనగా ట్వీట్ చేస్తూ,
“ తుమ్మెదల ఝుంకారాలు
నెమళ్ళ క్రేంకారాలు
ఏనుగుల ఘీంకారాలు
వైసీపీ గ్రామసింహాల గోంకారాలు
సహజమే ..”
అని రాసుకొచ్చారు.
మళ్లీ హిందూ దేవాలయాల పై వైఎస్ఆర్సిపి హయాంలో జరిగిన దాడులను ప్రస్తావిస్తూ- “ హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం. ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు? వైసీపీ ప్రభుత్వం ‘పాలసీ ఉగ్రవాదం’ కి అన్నీ రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయింది..”. అని ట్వీట్ చేస్తూ, మరొకసారి వైసీపీ గ్రామ సింహాలు ఇప్పుడు ఏమైపోయాయి అంటూ ఎద్దేవా చేశారు.
మొత్తానికి వైఎస్ఆర్ సీపీ నేతలు వ్యక్తిగత దాడులకు దిగడం మాత్రమే చేస్తారా లేక పవన్ కళ్యాణ్ లేవనెత్తిన సమస్యలపై సాధికారికంగా సమాధానం ఇవ్వగలరా అన్నది వేచి చూడాలి.