పవన్ కల్యాణ్ దసరా నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు బస్సు యాత్ర చేయాలనుకున్నారు . ఇందు కోసం జన సైనికులు కూడా రెడీ అయ్యాయి. పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ అనూహ్యంగా తన యాత్రను వాయిదా వేసుకుంటున్నట్లుగా ప్రకటించారు. దీంతో జనసేన శ్రేణుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎప్పుడో ఓ సారి వచ్చి .. ప్రసంగాలు చేయడం మినహా పవన్ నేరుగా ప్రత్యక్షంగా చేసిన ఉద్యమాలు దాదాపుగా లేవు.
ఎన్నికల ఏడాదిలో అయినా ఆయన పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తారని ఆశించారు. కానీ చివరికి యాత్రను వాయిదా వేసుకున్నారు. జనవాణి కార్యక్రమంలో చాలా ఆర్జీలు వచ్చాయని వాటిని అధ్యయనం చేసేందుకు సమయం తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు వచ్చే నెల నుంచి నియోజకవర్గాల వారీ సమీక్షలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఓ వైపు టీడీపీ తరపున లోకేష్ పాదయాత్రకు రెడీ అవుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న సమయంలో పవన్ తన బ స్సు యాత్రను వాయిదా వేయడం .. జనసైనికుల్ని ఇబ్బంది పెడుతోంది.
మరో వైపు పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 47-67 మధ్య మాత్రమే సీట్లు వస్తాయని స్పష్టంచేస్తున్నారు. అంటే ప్రభుత్వం మారుతుందని అంటున్నారు. అయితే ఖచ్చితంగా జనసేన పార్టీ వస్తుందని చెప్పలేదు. కానీ గెలిచే వారికే టిక్కెట్లిస్తామని చెప్పుకొచ్చారు. మొత్తానికి పవన్ కల్యాణ్ ఎప్పట్లాగే తన అస్పష్ట విధానాన్నే మరోసారి బయట పెట్టారు కానీ.. స్పష్టమై రాజకీయ ఆలోచన మాత్రం ప్రజల ముందు పెట్టలేకపోయారు.