‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రి కి దగ్గర్లోని వేమగిరిలో ఘనంగా జరిగింది. ఈఈవెంట్ కు పవన్ కల్యాణ్ అతిథిగా రావడమే ప్రత్యేకత. గోదావరి జిల్లాలో ఈ వేడుక నిర్వహించడం, పవన్ రావడం తో మెగా అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రామ్ చరణ్ నుంచి దిల్ రాజు వరకూ అందరూ ముక్తసరిగానే మాట్లాడారు. సమయం మించిపోతోందనో, వేడుక రసాభస కాకూడదనో… మైకు పట్టుకొన్న వాళ్లంతా క్లుప్తంగా తమ ప్రసంగాలు ముగించారు. ఓ దశలో పవన్ కూడా ‘స్పీచులు త్వరగా ముగించండి’ అంటూ నిర్వాహకులకు సూచన ఇచ్చారు. సినిమా వేడుకల్లో తరచూ చూసే వినోద కార్యక్రమాలేం కనిపించలేదు. పవన్ కల్యాణ్ స్పీచ్ ఒక్కటే ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణ అయ్యింది.
పవన్ ఈ వేదికపై చాలా విషయాలు మాట్లాడారు. వేదికపై ఉన్నవాళ్లందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, దాదా సాహెబ్ ఫాల్కే దగ్గర్నుంచి.. మహేష్, ప్రభాస్ వరకూ తెలుగు చిత్రసీమకు వన్నె తెచ్చిన హీరోల్నందరినీ గుర్తు చేసుకొన్నారు. వాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. అన్నింటికంటే ముఖ్యంగా తన ఉన్నతికి కారణమైన చిరంజీవిని ఈ వేదికపైనుంచి కృతజ్ఞతలు చెప్పుకొన్నారు. తమ కుటుంబం నుంచి ఎవరు ఎదిగినా దానికి కారణం ఆయనే అంటూ పవన్ చెప్పిన మాటలు అభిమానుల్ని ఆకట్టుకొన్నాయి.
టికెట్ రేట్ల గురించి పవన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. టికెట్ రేట్లు ఎందుకు పెంచాలో స్పష్టంగా చెప్పారు. ఎంటర్టైన్మెంట్ టాక్స్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని, అలాంటప్పుడు చిత్రసీమ అభివృద్ది కోసం, టికెట్ రేటు పెంచితే తప్పేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో టికెట్ రేట్లు ఎలా ఉన్నాయో గుర్తు చేశారు. తన సినిమాల టికెట్ రేట్లు పెంచుకోనివ్వలేదని, ఆ పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని అన్నారు. కూటమి తరపున మాట్లాడేందుకు హీరోలెవరూ రాలేదని, అయితే.. సినిమా వేరు, రాజకీయం వేరని, ఆ దృష్టితోనే తమ ప్రభుత్వం చూస్తుందని భరోసా కలిగించారు పవన్.
ఏపీలో సినిమా ఫిల్మ్ స్కూల్స్ పెట్టాలని దిల్ రాజుకు సూచించారు. తెలంగాణ సినిమాపైనే ఫోకస్ చేయకుండా ఆంధ్రానీ పట్టించుకోవాలని సలహా ఇచ్చారు. తెలంగాణలో సినిమా అభివృద్ది చెందాలని, ఆంధ్రాలోనూ వృద్దిలో రావాలని ఆకాంక్షించారు. త్రివిక్రమ్, రాజమౌళి, కీరవాణి, తమన్లాంటి వాళ్లని తీసుకొచ్చి ఔత్సాహికులకు తర్ఫీదు ఇవ్వాలని, క్లాసులు చెప్పాలని కోరారు.
మధ్యమధ్యలో పవన్ శైలి ఛలోక్తులూ పడ్డాయి. అభిమానులు `ఓజీ.. ఓజీ` అంటూ కేకలు వేస్తుంటే `దుంప తెంచకండ్రా` అంటూ నవ్వుతూ బదులిచ్చారు. చరణ్ గుర్రపు స్వారీ చేస్తుంటే ఓ హీరోగా అసూయ పడ్డానని, తనకు గుర్రపు స్వారీ రాదని ఎలాంటి భేషజాలూ లేకుండా చెప్పేశారు పవన్. `గబ్బర్ సింగ్` సమయంలో `నాకు హార్స్ రైడింగ్ రాదు. కాబట్టి నువ్వే నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లాలి` అంటూ గుర్రం చెవిలో చెప్పిన విషయాన్ని సరదాగా గుర్తు చేసుకొన్నారు. `ఖుషీ` సమయంలో `యే మేరా జహా` పాట సందర్భంగా దర్శకుడు సూర్యతో జరిపిన సంభాషణ ఆయన మళ్లీ నెమరు వేసుకొన్నారు. సమాజానికి పనికొచ్చే సినిమాలు తీయాలని, హాలీవుడ్ ని కాపీ చేయడం మానేయాలని, అప్పుడే తెలుగు సినిమా ముందడుగు వేస్తుందని దర్శక నిర్మాతలకు దిశానిర్దేశం చేశారు పవన్.