పెద్ద సినిమా విడుదలయ్యేటప్పుడు టికెట్ రేట్ల పెంపుదల విషయంలో నిర్మాతలు నానా హైరానా పడిపోతుంటారు. టికెట్ రేట్లు పెంచుకొనే అవకాశం ఇవ్వండంటూ ప్రభుత్వాన్ని కోరుకోవం, ఆ తరవాత ఓ జీవో రావడం.. ఇలా ఓ ప్రోసెస్ ఉంటుంది. గతంలో జగన్ రెడ్డి పాలనలో ఈ వెసులు బాటు కూడా లేదు. ‘టికెట్ రేట్లు పెంచండయ్యా మహానుభావా’ అని అడిగితే, తగ్గించి పారేశారు. ఇంట్రవెల్ లో కొనుక్కొనే సమోసాకు ఇచ్చిన విలువ కూడా సినిమా టికెట్ కు ఇవ్వలేదు. దాంతో పెద్ద సినిమాలు కుదేలైపోయాయి. ఇప్పుడు ఆ భయం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం నిర్మాతల పక్షాన నిలబడింది. పెద్ద సినిమాలకు చేదోడు వాదోడుగా ఉంటామన్న భరోసా కల్పిస్తోంది. మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు సినిమా వాళ్ల సాధకబాధకాలు తెలుసు. అప్పట్లో టికెట్ రేట్ల పెంపుదల విషయంలో చిత్రసీమని చులకనగా చూస్తునన్ జగన్ రెడ్డి ప్రభుత్వంపై పవన్ విరుచుకుపడిన వైనం గుర్తుండే ఉంటుంది.
ఇప్పుడు ప్రభుత్వం మారింది. పద్ధతులూ మారాయి. చిత్రసీమ ఇబ్బందులు అర్థం చేసుకొన్న పవన్ కల్యాణ్ టికెట్ రేట్ల పెంపు విషయంలో నిర్మాతలకు ఓ స్పష్టమైన భరోసా ఇచ్చారు. పెద్ద సినిమా విడుదలైన ప్రతీసారీ నిర్మాతలు ప్రభుత్వం చుట్టూ తిరిగే అవసరం లేకుండా, సినిమా బడ్జెట్, స్థాయిని బట్టి ఓ రేటు ఫిక్స్ చేసేలా… జీవో తీసుకొస్తామని నిర్మాతలకు పవన్ భరోసా ఇచ్చినట్టు సమాచారం. టికెట్ రేటు ఎంత ఉండాలన్న నిర్ణయాన్ని కూడా నిర్మాతలకే వదిలేసినట్టు తెలుస్తోంది. నిర్మాతలంతా కూర్చుని మాట్లాడుకొని, ఓ రేట్ అంటూ ఫిక్స్ చేసుకొస్తే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి, ఆయన్ని ఒప్పిస్తానని నిర్మాతలకు పవన్ హామీ ఇచ్చారని సమాచారం. ఇటీవల టాలీవుడ్ నుంచి కొంతమంది సినిమా పెద్దలు పవన్ను కలుసుకొన్న సంగతి గుర్తుండే ఉంటుంది. త్వరలోనే ముఖ్యమంత్రితోనూ సినిమావాళ్ల ములాఖాత్ ఉండబోతోంది. అదే సమావేశంలో టికెట్ రేట్ల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.