చంద్రబాబు అరెస్ట్ అనంతరం పలు రాజకీయ పార్టీల నాయకులు అరెస్ట్ ఖండిస్తూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ని పరామర్శించడానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కు ఏపీ పోలీసులు చుక్కలు చూపించారు. ముందుగా స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరుదామని పవన్ కళ్యాణ్ అనుకోగా ప్రత్యేక విమానానికి అనుమతి ఇవ్వకుండా ప్రత్యేక విమానం టేక్ ఆఫ్ అవ్వకుండా అధికారులు అడ్డుపడ్డారు.
దీంతో రోడ్డు మార్గంలో బయలుదేరిన పవన్ కళ్యాణ్ వాహనాన్ని పోలీసులు గరికపాడు చెక్పోస్ట్ వద్ద అడ్డుకున్నారు. ఇటువైపు దాదాపు 200 మంది పోలీసులు అటువైపు వేలాదిగా తరలివచ్చిన జనసేన అభిమానుల తో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే అక్కడినుండి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ బయలుదేరగా మళ్లీ జగ్గయ్యపేట వద్ద, , ఆ తర్వాత అనుమంచిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అడుగడుగునా కాన్వాయ్ అడ్డుకుంటూ ఉండడంతో పవన్ కళ్యాణ్ సైతం జాతీయ రహదారికి అడ్డంగా పడుకుని నిరసన వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తలు సైతం రోడ్డు మీద పడుకుని నిరసన తెలియజేయడంతో మళ్లీ కుదిరిత్తత నెలకొంది. పలుచోట్ల జనసేన కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకానొక సమయంలో కాలినడకన బయలుదేరడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాలంటే పాస్ పోర్ట్ , వీసా కావాలేమో అంటూ పవన్ కళ్యాణ్ సెటైర్ వేశారు. జి 20 సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇలాంటివి జరగడం మచ్చ అని అన్న పవన్ కళ్యాణ్ గూండాలకు అధికారం ఇస్తే ఇలాగే జరుగుతుంది అని, గుండాలకు జీ 20 విలువ ఏం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు విజయవాడ వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ కి పోలీసులు అనుమతి ఇచ్చారు.