రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలి – ఇది వైఎస్సార్సీపీ అధినేత జగన్ పదేపదే చెప్పే ఒక డైలాగ్. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని ఆయన తో పోలిస్తే తనకు ఎంతో విశ్వసనీయత ఉందని జగన్ ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అయితే మాట తప్పని మడమ తిప్పని నేత తాను అని స్వయంగా చెప్పుకునే జగన్ తాను మాట ఇచ్చి, ఎన్నో ఏళ్లుగా తనతో కోట్లు ఖర్చు పెట్టించి ఆఖరి నిమిషంలో టికెట్ ఇవ్వకుండా చేసిన గుణ్ణం నాగబాబు ని పార్టీలోకి చేర్చుకుంటూ జనసేన పార్టీ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ సందర్భంలో విశ్వసనీయత లేని జగన్ అంటూ సూటిగా జనసేన చేసిన విమర్శను వైఎస్సార్సీపీ నేతలు సైతం తిప్పి కొట్టలేని పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే..
అనూహ్యంగా మారిపోయిన పాలకొల్లు రాజకీయం:
పాలకొల్లు నియోజకవర్గం లో గున్నం నాగబాబు ఎన్నో సంవత్సరాలుగా వైఎస్సార్సీపీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. నియోజకవర్గ ప్రజలతో మమేకం అయిపోయి, వైఎస్సార్సీపీ పార్టీ కార్యక్రమాల కోసం ఎంతో డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నారు. అయితే తనకే టికెట్ ఇస్తానని ఎన్నోసార్లు మాట ఇచ్చిన జగన్ ఆఖరి నిమిషంలో లో తనకు హ్యాండ్ ఇచ్చారు. గతంలో టీడీపీ మరియు బీజేపీ పార్టీలో పనిచేసిన బాబ్జి ని పాలకొల్లు అభ్యర్థిగా ప్రకటించేశారు. దీంతో గుణ్ణం నాగబాబు కన్నీటి పర్యంతం కావడం నియోజకవర్గ ప్రజలను సైతం కదిలించింది. అయితే, జనసేన పార్టీ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం చూస్తే, జనసేన శ్రేణులు సైతం గుణ్ణం నాగబాబు అభ్యర్థిత్వాన్ని బలపరిచాయని, తనను పార్టీలోకి తీసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదని వారు చెప్పారని జనసేన ప్రకటన పేర్కొంది. చేగొండి హరిరామ జోగయ్య తదితర నేతలు గుణ్ణం నాగబాబు ని పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకెళ్లారు. గతంలో చిరంజీవి ని గెలిపించుకోలేక పోయాను అని ఎన్నోసార్లు బాధ వ్యక్తం చేసిన హరిరామజోగయ్య ఈసారి పాలకొల్లు జనసేన అభ్యర్థిని గెలిపించి తన బాధను తుడిచేసుకుంటానని జనసేన శ్రేణులతో వ్యాఖ్యానించారు. జనసేన శ్రేణులతో పాటు హరిరామ జోగయ్య లాంటి వ్యక్తులు కూడా గుణ్ణం నాగబాబు అభ్యర్థిత్వాన్ని బలపరచడంతో పవన్ కళ్యాణ్ ఆయనను పార్టీలోకి చేర్చుకున్నారు. పాలకొల్లు టికెట్ కూడా దాదాపుగా ఆయనకు ఖాయమైనట్టే.
అయితే ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం ఖర్చు పెట్టుకున్నప్పటికీ, పార్టీ కోసం పని చేసినప్పటికీ తనకు జగన్ టికెట్ ఇవ్వలేదని, పవన్ కళ్యాణ్ కనీసం ఒక్క రూపాయి కూడా అడగకుండా పార్టీ టికెట్ ఇచ్చాడని గుణ్ణం నాగబాబు కన్నీటి పర్యంతమయ్యారు. కచ్చితంగా ఈ స్థానాన్ని గెలుచుకుని పవన్ కళ్యాణ్ కు కానుకగా ఇస్తానని ఆయన కార్యకర్తలతో అన్నారు. పవన్ కళ్యాణ్ గుణ్ణం నాగబాబు ని పార్టీలో చేర్చుకున్న సందర్భంగా విడుదల చేసిన ప్రకటనకు శీర్షికగా ” విశ్వసనీయత కోల్పోయిన నాయకులు పాలకులు అయితే ఈ పరిస్థితులు దారుణంగా ఉంటాయి” అంటూ నేరుగా జగన్ పై గురి ఎక్కుపెట్టడం కూడా స్థానికం గా గుణ్ణం నాగబాబు కార్యకర్తలను జనసేన కార్యకర్తల లోను కదనోత్సాహాన్ని నింపింది.
గతంలో పితాని బాలకృష్ణ ను కూడా డబ్బు కారణంగా తిరస్కరించిన జగన్:
అయితే ఇప్పుడు గుణ్ణం నాగబాబును ఏ కారణాలతో అయితే తిరస్కరించాడో గతంలో గోదావరి జిల్లాలలోని ముమ్మిడివరంలో వైఎస్సార్సీపీ పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన పితాని బాలకృష్ణ ని కూడా ఇదే రకంగా జగన్ తిరస్కరించాడు. నువ్వు డబ్బు ఖర్చు పెట్టుకోలేవని చెబుతూ టికెట్టు ఇవ్వనని జగన్ పితాని బాలకృష్ణకు తెగేసి చెప్పారు. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పితాని బాలకృష్ణ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ముమ్మిడివరం టికెట్టు ఇచ్చారని పితాని బాలకృష్ణ స్వయంగా పలు సభలలో చెప్పారు.
ఏది ఏమైనా పాలకొల్లు రాజకీయం అనూహ్యంగా మారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి కూడా ప్రస్తుతానికి బలంగానే కనిపిస్తున్నారు. అయితే 2019 ఎన్నికలలో పాలకొల్లు నియోజకవర్గంలో పోటీ కేవలం టీడీపీ జనసేన మధ్యనే కేంద్రీకృతం అయ్యేటట్టు కనిపిస్తోంది.