జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన లాంగ్ మార్చ్ కి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై విపక్షాలను పవన్ కళ్యాణ్ ఏకం చేయడమే కాకుండా ఆ సమస్య తీవ్రతను అందరికీ తెలిసేలా చేశారు. అయితే ఈ సభలో విజయసాయిరెడ్డి మీద పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు.
ఇటీవల కాలంలో విజయసాయిరెడ్డి భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఆ చావులని చిన్న సమస్య అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించడం, ఆ సమస్య మీద పోరాడుతున్న రాజకీయ పార్టీలను రాబందులు అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించడం, దాని మీద నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలు రావడం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఈ రోజు సభలో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి మీద విరుచుకుపడ్డారు. ఇటీవలి కాలంలో విజయసాయిరెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, కానీ ఆయన ఒక విషయం గుర్తు పెట్టుకోవాలని, వీరి ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని తాను కానని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఒకప్పుడు రాజ్యసభ అంటే, అల్లాడి కృష్ణస్వామి లాంటి గొప్పవారు, ఎన్నికల ఒడిదుడుకులు ఎదుర్కోలేని వారు ఉండేవారని, ఇప్పుడేమో సూట్కేస్ కంపెనీలు పెట్టిన విజయసాయిరెడ్డి లాంటివారు రాజ్యసభకు కూర్చున్నారని, అది మన దౌర్భాగ్యం అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తన ఓటమి గురించి విజయసాయిరెడ్డి లాంటివారు మాట్లాడుతున్నారని, అంబేద్కర్ కాన్షీరామ్ లాంటి వారు కూడా ఓడిపోయారని, తాను వారి అంత గొప్ప వాడిని కాకపోయినా, వారి స్పూర్తితో ముందుకు సాగుతున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. రెండేళ్లు జైల్లో ఉన్న నాయకులు కూడా తనను విమర్శించే వారు అయిపోయారని పవన్కళ్యాణ్ ఎద్దేవా చేశారు. కర్ణాటక లో ఒక చిన్న పంక్షన్ జరిగితే అక్కడ తనకు ఎంతో పోలీసు భద్రతను ఇచ్చారని, తాను ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో ఎప్పుడు పర్యటించినా, అక్కడి పోలీసులు ఎంతో భద్రతను ఏర్పాటు చేయగా, ఇక్కడ విజయసాయిరెడ్డి పోలీసులకు ప్రత్యేక సూచనలు ఇచ్చి తనకు సరైన భద్రతా ఏర్పాట్లు చేయకుండా చూస్తున్నారని పవన్కళ్యాణ్ విమర్శించారు.
అయితే ఇదంతా ఒక ఎత్తయితే, విజయసాయిరెడ్డికి ” మేన్ ఫ్రై డే” అంటూ కొత్త బిరుదు పవన్ కళ్యాణ్ ఇచ్చారు. ఒకానొక కథలో రాబిన్ సన్ క్రుసో వద్ద పనిచేసే సర్వెంట్ ని ఉద్దేశించి ఉపయోగించిన ఈ పదప్రయోగం ఆ తర్వాతి కాలంలో “విధేయుడైన నమ్మినబంటు లాంటి పని వాడి”ని ఉద్దేశిస్తూ ఉపయోగించే పద ప్రయోగం లా మారింది. అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడే శ్లేష ఉపయోగిస్తూ, విజయసాయి రెడ్డి జగన్ కి నమ్మినబంటు అన్న ఉద్దేశంతోనే కాకుండా, ప్రతి శుక్రవారం ఆయనతోపాటు కోర్టుకు హాజరయే వ్యక్తిగా ‘ మేన్ ఫ్రైడే’ పద ప్రయోగానికి అతికినట్లు సరిపోయాడు అని దిమ్మతిరిగే పంచ్ వేసాడు.