ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ మూడు ప్రశ్నలు సంధించారు. లాక్ డౌన్ కారణంగా.. ప్రజలెవరూ ఇబ్బందులు పడకుండా చూస్తున్నామని అందర్నీ ఆదుకుంటున్నామని ప్రభుత్వ ప్రకటనల నేపధ్యంలో.. ప్రధానమైన మూడు వర్గాల సమస్యల్ని ఆయన ప్రస్తావిస్తూ.. కీలకమైన ప్రశ్నలు సంధించారు. మొదటి ప్రశ్న అక్వా రైతులకు సాయం చేయడంలో ప్రభుత్వ తీరును ఉద్దేశించి వేశారు. అక్వా రంగం ఆంధ్రప్రదేశ్ జీడీపీలో 7.4 శాతం కంట్రిబ్యూట్ చేస్తోందని.. ఆ రంగంలో పధ్నాలుగున్నర లక్షల మంది ఉపాధి పొందుతున్నారని.. లాక్ డౌన్ సమయంలో ఆ రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటని ప్రశ్నించారు. దీనిపై మంత్రులు అనేక ప్రకటనలు చేస్తున్నారు. అక్వా రంగాన్ని ఆదుకుంటామని.. పూర్తి స్థాయి ధర కల్పిస్తామని చెబుతున్నారు. దీన్నే పవన్ కల్యాణ్ పరోక్షంగా ప్రస్తావించారు. పూర్తి ధర రైతులకు ఎప్పుడు అందుతుంది..? దీనికోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థేమిటి..? అని సూటిగా ప్రశ్నించారు.
ఇక ఉద్యాన పంటల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు.. వారి పంటలు అమ్ముకోలేని పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితులపై పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 17.62 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని …పంటలు సాగుచేస్తున్న రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, ముఖ్యంగా అరటి రైతులు పంటను కోల్పోయే ప్రమాదముందన్నారు. ప్రభుత్వం ధరల స్థిరీకరణకు రూ. మూడు వేల కోట్లు కేటాయించిందని గతంలో ప్రకటిచిందని గుర్తు చేశారు. వీటిని ఉపయోగించి.. రైతుల వద్ద నుంచి నేరుగా పంటలు ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎప్పుడు కొనుగోలు చేస్తారో చెప్పాలన్నారు.
మూడో అంశంగా భవన నిర్మాణ.. అసంఘటిత రంగ కూలీల ఇబ్బందులను ప్రస్తావించారు. రాష్ట్రంలో 21లక్షల మంది గుర్తింపు పొందిన భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, మరో 30లక్షల మంది వరకు గుర్తింపు పొందని కూలీలు ఉన్నారన్నారు. లాక్డౌన్ కారణంగా రోజు వారీ కూలీలు తమ జీవనాధారాన్ని కోల్పోయారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వ కనీస బాధ్యత కాదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు వారికి సాయం అందిస్తారా లేదా.. అని సూటిగా ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పవన్ కల్యాణ్ చేసే ట్వీట్లకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించారు కానీ.. ఏపీ సీఎం ఇంత వరకూ స్పందించలేదు. ఈ ట్వీట్లపైనా స్పందిస్తారో లేదో వేచి చూడాలి..!
Feedback ,I got from our Janasainiks & Leaders regarding the plight of construction workers & their families during this ‘Lock down’. I hope YCP Govt addresses this. pic.twitter.com/updO6YJ0iN
— Pawan Kalyan (@PawanKalyan) March 31, 2020
ఉద్యానపంటల రైతులు సమస్యలు : pic.twitter.com/QuxKInwHtq
— Pawan Kalyan (@PawanKalyan) March 31, 2020
ఆక్వా రైతులు -వారి ఆందోళన : pic.twitter.com/iRffSQCvXY
— Pawan Kalyan (@PawanKalyan) March 31, 2020