జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవలే సతీ సమేతంగా కొత్త ఇంటి కోసం భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాలోని ఖాజాలో సర్వే నంబర్ 368/ బి 1 లోని 2.07 ఎకరాల్లో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే, ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్న సంగతి తెలిసిందే. ఎకరాకి రూ. 2 కోట్ల వరకూ పలుకుతోందట. కానీ, దాన్లోని కేవలం పది శాతం ధరకే సదరు భూమిని పవన్ కల్యాణ్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఎకరాకి రూ. 20 లక్షలకు చొప్పున, 2.07 ఎకరాల భూమిని రూ. 41,40,000కి పవన్ కొనుగోలు చేసినట్టుగా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ చెబుతున్నాయి. కానీ, ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ ధర కూడా దాదాపు రూ. 10 కోట్లు వరకూ ఉంటున్నాయనీ, ప్రస్తుతం పవన్ నిర్మించ తలపెట్టిన ఇంటి స్థలానికి కూడా దాదాపు అదే ధర ఉంటుందని స్థానిక రియల్టర్లు కొంతమంది ‘తెలుగు 360’తో అభిప్రాయపడ్డారు. అంతేకాదు, అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం… ఈ ఇంటి స్థలం అతి తక్కువ ధరకే పవన్ కు దక్కడం వెనక ఒక సెటిల్మెంట్ స్టోరీ ఉందట.? రాజమండ్రి నేపథ్యంలో తెరవెనక కథంతా నడిచిందని సమాచారం..!
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఎన్నారై ప్రసాద్ అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ కొన్ని ప్రాజెక్టులు చేపట్టాక, రాజమండ్రిలో కూడా హైరైజ్ భవనాలు నిర్మించాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు, నిర్మాణానికి సంబంధించిన అనుమతులు కూడా పొందారు. కానీ, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సోమేశ్వరరావు అనే వ్యక్తి వల్ల ఈ ప్రాజెక్టు వివాదంలో చిక్కుకుని, పనులు ఆపేయాల్సి వచ్చింది. ఈ సోమేశ్వరరావుకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో బంధుత్వం కూడా ఉందట..! ఈ వివాదాంశం రాజమండ్రి అర్బన్, రూరల్ ఎమ్మెల్యేల వరకూ వెళ్లింది. ఇదే సమయంలో జనసేనకు చెందిన కీలక సభ్యుడు మారిశెట్టి రాఘవయ్యను ఎన్నారై ప్రసాద్ కలుసుకున్నారు. ఇక్కడే ఒక డీల్ తెరమీదికి వచ్చినట్టు సమాచారం..! రాజమండ్రిలో లిటిగేషన్ లో పడ్డ తన భూ వివాదం పరిష్కరిస్తే.. దానికి ప్రతిఫలంగా పవన్ కల్యాణ్ నిర్మించబోయే కార్యాలయం లేదా ఇంటి నిర్మాణ ఖర్చులన్నీ తాను భరిస్తానని ప్రసాద్ ప్రతిపాదించినట్టు సమాచారం. ఇదే అంశమై పవన్ కల్యాణ్ అనుమతి తీసుకున్నాక.. ఒక మాజీ డీజీపీ సహాయంతో ప్రసాద్ ల్యాండ్ లిటిగేషన్ ను రాఘవయ్య పరిష్కరించారట.
ఒప్పందం ప్రకారం సదరు ఎన్నారై ప్రసాద్, రాజకీయాల్లోకి రావాలనే ఆశతో ఉన్న ఒక రిటైర్డ్ ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ (మాజీ ఐటీ కమిషనర్) సహాయంతో.. ఈ రెండు ఎకరాల భూమిని నామ మాత్రపు ధరకి పవన్ కల్యాణ్ పేరున రిజిస్ట్రేషన్ చేయించారని తెలుస్తోంది. అయితే, ఈ భూమిలో లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీవారు ఒక వెంచన్ వేద్దామని అనుకున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ పూజ చేసిన భూమి అదే. గతంలో ఇదే లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఒక గెస్ట్ హౌస్ ను విక్రయించడం ఈ సందర్బంలో ప్రస్థావనార్హం. మొత్తానికి, ఈ క్విడ్ ప్రోకోలో ప్రత్యక్షంగా జనసేన పార్టీ సభ్యుడికీ, పరోక్షంగా పవన్ కల్యాణ్ కీ సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.