ప్రస్తుతం తానా సభల కోసం అమెరికాలో ఉన్న పవన్ కళ్యాణ్, బిజెపి వ్యూహకర్త రామ్ మాధవ్ తో భేటీ అయ్యారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఈ భేటీ లో చర్చ జరిగి ఉంటుందనే విషయం మీద ఆసక్తి నెలకొంది. వివరాల్లోకి వెళితే..
తెలుగు రాష్ట్రాల్లో బలపడాలనే వ్యూహం తో ముందుకు వెళ్తున్న బిజెపి, అందుకు అవసరం అయ్యే ఏ ఒక్క అవకాశం కూడా వదులుకోవడం లేదు. ఇటీవలే చిరంజీవిని బిజెపిలోకి ఆహ్వానించినప్పటికీ, రామ్ మాధవ్, కన్నా లక్ష్మీనారాయణ ల నుండి వచ్చిన ఆ ప్రతిపాదనకు చిరంజీవి సానుకూలంగా స్పందించలేదు. రాష్ట్రంలోని ఒక బలమైన సామాజిక వర్గం దన్నుగా ఉన్నప్పటికీ, వాటిని ఓట్లు గా మలుచుకోవడంలో అటు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా, ఇటు పవన్ కళ్యాణ్ జనసేన ద్వారా విఫలం కావడంతో బిజెపి వ్యూహకర్తలు అదే సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు రకరకాల వ్యూహాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ మాధవ్, పవన్ కళ్యాణ్ ల బేటి రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది.
అయితే ఇప్పటికే జనసేన ని ఏ పార్టీలోకి విలీనం చేసేది లేదని, తన శ్వాస ఉన్నంతవరకు జనసేన పార్టీని నిలబెట్టుకుంటానని పవన్ కళ్యాణ్ తెగేసి చెప్పిన దరిమిలా రామ్ మాధవ్ పవన్ కళ్యాణ్ తో ఏమి చర్చించి ఉంటారని ఆసక్తి నెలకొంది. కొత్త ప్రభుత్వం నెలరోజుల పాలన మీద, విభజన హామీల మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మీద కూడా వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. దాదాపు గంటపాటు జరిగిన ఈ భేటీ లో అధికారికంగా చెబుతున్న ఈ అంశాలే కాకుండా ఇతర రాజకీయ చర్చ కూడా వచ్చి ఉంటుందని అందరూ ఊహించ గలిగినప్పటికీ, అది ఏ అంశాలమీద అన్నది మాత్రం ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదు.
ఏది ఏమైనా తానా సభల కేంద్రం గా జరుగుతున్న ఈ భేటీ ఏ కొత్త రాజకీయ సమీకరణలకు దారి తీస్తుంది అనేది వేచి చూడాలి.