మన నాయకులు మాట్లాడే మాటలకు, చేతలకు అస్సలు సంబంధమే ఉండదు. ఆ మాటకొస్తే వాళ్ళ మాటల వెనుక కూడా బోలెడంత రాజకీయమే ఉంటుంది. వేరే ఏదో టార్గెట్‌ని దృష్టిలో పెట్టుకుని….ఇంకేదో విషయంపైన గొప్పగా మాట్లాడేస్తూ ఉంటారు. యువరాజ్యం అధినేతగా ఉన్నప్పుడు నిజాయితీగా, ఆవేశపూరితమైన రాజకీయాలు చేసిన పవన్ ఇప్పుడు మాత్రం ఫక్తు పొలిటీషియన్‌లా మారిపోయాడు. తాజాగా జల్లికట్టు విషయంపై ట్విట్టర్లో తాను చేసిన కామెంట్స్‌తో మరోసారి అలాంటి రాజకీయమే చేశాడు పవన్.
జైహింద్ అనే మాటకు తెలుగు సినిమా హీరోల్లో బ్రాండ్ అంబాసిడర్లాంటోడు పవన్. తన ప్రసంగం పూర్తయ్యాక జైహింద్ అంటూ పవన్ చెప్పడాన్ని కూడా ఆయన భక్తులు చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. జైహింద్ అనడంలో కూడా పవన్ గొప్పతనాన్ని చూడమని మనకు చెప్తూ ఉంటారు. నిజంగా కూడా అది గొప్ప విషయమే. అలాగే జాతీయ స్ఫూర్తి అంటూ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా గొప్పగా మాట్లాడేశాడు పవన్. తెలుగు వాళ్ళ మనసుల్లో విభేదాలు సృష్టించవద్దని చెప్పాడు. ఆ మాటలను కూడా అభినందించాల్సిందే. కానీ అదే పవన్ ఇప్పుడు తమిళ ప్రజల ప్రేమకోసం జాతీయ సమైక్యతకు భంగం కలిగించేలాంటి మాటలు మాట్లాడేశాడు. దశాబ్ధాల క్రితం ద్రావిడ సంస్కృతి అన్న మాటను పట్టుకుని ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం మధ్య విభజన రాజకీయాలు చేశారు తమిళ నాయకులు. ఆ నినాదాలను ఆధారంగా చేసుకుని సౌత్ ఇండియన్స్‌కి, తమిళ ప్రజలకు ఏం ఒరగబెట్టారో తెలియదు కానీ చాలా మంది నాయకులయ్యారు. పార్టీలు పెట్టారు. ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. కానీ వాళ్ళు సృష్టించిన విభేదాల విషం మాత్రం ఇప్పటికీ ప్రజా జీవితాలపైన ప్రభావం చూపిస్తూనే ఉంది. ప్రాంతీయ ప్రయోజనాల కోసం పాటుపడడంలో తప్పులేదు. కానీ జనాలను రెచ్చగొడుతూ, విభేదాలు సృష్టిస్తూ రాజకీయం చేయాల్సిన అవసరం లేదేమో. జల్లికట్టుపై నిషేదం నేపథ్యంలో అసలే తమిళ నాడు రణరంగమై ఉన్న నేపథ్యంలో పవన్‌లాంటి ఆలోచనాపరులు కూడా ద్రావిడ సంస్కృతిపై దాడి అంటూ మాట్లాడడం మాత్రం భావ్యం కాదు. అంతకంటే కూడా 2014లో నరేంద్రమోడీ, చంద్రబాబులకు సపోర్ట్‌గా ప్రచారం చేసిన పవన్…..ఇప్పుడు కూడా ఆ మోడీకి మిత్రుడిగానే ఉన్న చంద్రబాబుతో మాట్లాడి వివాదాన్ని పరిష్కరించమని చెప్పి నరేంద్రమోడీపైన ఒత్తిడి తీసుకుని వస్తే బాగుంటుందేమో. అంతేగానీ జైహింద్, జాతీయ సమైక్యతా భావం అని చాలా సార్లు చాలా గొప్పగా మాట్లాడిన పవన్…..ఇప్పుడు ద్రావిడ సంస్కృతిపై దాడి అంటూ మరోసారి ఉత్తర-దక్షిణ భారతాల మధ్య విభేదాలను పెంచే మాటలు మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదేమో. ఆలోచించు పవన్.