మద్యపాన నిషేధంపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ వైకాపా ఓ హామీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అలాంటి హామీ ఇచ్చారు! రామచంద్రాపురంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ… సంపూర్ణ మద్యపాన నిషేధం చాలా కష్టమైందన్నారు. ఎన్టీ రామారావు నిషేధం అమలు చేసినప్పుడు, కొంతమంది ఎమ్మెల్యేలూ ఎంపీలూ అక్రమంగా లిక్కర్ సిండకేట్లుపై డబ్బులు సంపాదించుకున్నారు అని ఆరోపించారు. తన దగ్గరకి కొంతమంది ఆడపడుచులు వచ్చి సంపూర్ణ మద్యపాన నిషేధం చేయమని కోరారు అన్నారు. అయితే, 60 నుంచి 70 శాతం మహిళలు, వారివారి నియోజక వర్గాల్లో మద్యం షాపులు వద్దు అంటే… ఆయా ప్రాంతాల్లో అంచెలవారీగా మద్య నిషేధం చేసి పెడతాను అన్నారు పవన్ కల్యాణ్.
‘ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్య నిషేధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏం వద్దా (నవ్వుతూ).. మీరు చెప్పండి… కావాలా వద్దా (నవ్వుతూ)’ అంటూ ప్రజలను ప్రశ్నించారు. సంపూర్ణ మద్య నిషేధం మీద జనసేన పార్టీ నుంచి ఒక రెఫరెండమ్ పెడతామని తాను మహిళలకు చెప్పాను అన్నారు. అప్పుడున్న పరిస్థితులను బట్టీ గ్రామాలవారీగా, లేదా ప్రాంతాలవారీగా, లేదంటే నియోజక వర్గాలవారీగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి… ఎక్కువ శాతం మంది కోరుకుంటే అంచెలవారీగా నిషేధం అమలు చేస్తామన్నారు. ఆంధ్రాలో నిషేధం చేస్తే యానం నుంచి మద్యం వస్తుందనీ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్ గడ్, ఒడిశాల నుంచి వస్తుందన్నారు. ‘మన చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే తప్ప, ఇక్కడ అమలు కాదు’ అన్నారు.
మద్యపాన నిషేధం హామీ మీద ఇంత గందరగోళం ఎందుకు..? రెఫరెండమ్ నిర్వహించాల్సిన అవసరం ఏముంది..? మద్యపానం ఆరోగ్యాన్నీ కుటుంబాలనూ నాశనం చేస్తోందని మెజారిటీ మహిళల అభిప్రాయ సేకరణ చేస్తేగానీ తెలీదా? నిషేధించగలం అనుకుంటే… అదే హామీ ఇవ్వండి. లేదనుకుంటే, ఆ టాపిక్ మాట్లాడొద్దు. ఇక్కడ ఇంకో గందరగోళం కూడా ఉంది. మీరు కోరుకుంటే నిషేధం అమలు చేస్తామంటూనే… పక్క రాష్ట్రాల్లో కూడా నిషేధం అమలు చేస్తే తప్ప ఇక్కడ అమలు కాదని పవన్ చెప్పడం దేనికి..? పక్క రాష్ట్రాలతో సంబంధం ఏముంటుంది..? అలా అనుకుంటూ పోతే ప్రతీ రాష్ట్రానికీ ఒక పక్క రాష్ట్రం ఉంటూనే ఉంటుంది కదా. ఆ లెక్కన దేశమంతా మద్య నిషేధం చేస్తేగానీ.. ఆంధ్రాలో అమలు సాధ్యం కాదన్నట్టా..?