జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ ఆలోచనల్లో స్వచ్చతపై ఎవరికీ అనుమానం లేదు. కానీ ఆయనపై అందరికీ నమ్మకం బలపడేలా చేసుకోలేకపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఆయన రాజకీయాలు ప్రారంభించినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. ఆయన ప్రసంగాల్లో ఓ అయోమయం కనిపిస్తోంది. ఓ అస్పష్టత వెల్లడవుతుంది. ఆయన ప్రసంగం ఆసాంతం విన్న వారికి జనసేనకు ఓటు వేయమని చెప్పారా… వేయవద్దని చెప్పారా స్పష్టత లేకుండా పోతుంది. తాజాగా తూ.గో జిల్లా టూర్లోనూ అదే చెబుతున్నారు.
అధికారం కోసం రాలేదని పదే పదే ఎందుకంటారు !?
రాజకీయాల్లోకి ఎవరైనా అధికారంలోకి వస్తారు. అధికారం కోసమే పని చేస్తారు. అధికారం సాధించిన తర్వాతా ఏం చేస్తారనేది తర్వాత విషయం. తమ లక్ష్యం అధికారంలోకి రావడం. కానీ ఇక్కడ పవన్ కల్యాణ్ ఏం చెబుతున్నారు ? దాదాపుగా ప్రతి ప్రసంగంలో జనసేనకు అధికారం ముఖ్యం కాదంటారు. అధికారం కోసం రాలేదంటారు. పాతికేళ్ల రాజకీయ భవిష్యత్ కోమంటారు. ఓటు అడగనని కూడా కొన్ని సందర్భాల్లో చెబుతూ ఉంటారు. ఈ మాటలన్నీ ఆయనకు రాజకీయ అధికారం మీద ఆసక్తి లేదేమో అనిపిస్తున్నాయి.
మళ్లీ వెంటనే జనసేన అధికారంలోకి వస్తుందని ప్రకటిస్తారు !
ఇలా అధికారంపై యావ లేదని చెబుతారు.. వెంటనే.. జనసేన అధికారంలోకి వస్తుందని నిరుద్యోగ యువతకు తలా పది లక్షలు ఇస్తుందని చెబుతారు. పవన్ కల్యాణ్ అధికారం కోసం రాలేదని చెప్పడం ఎంత తప్పుడు సంకేతాలు పంపుతుందో.. వెంటనే అధికారం వస్తే అనే మాటలు చెప్పుడం కూడా అంతే రివర్స్ ట్రాక్ అవుతుంది. అదే జరుగుతోంది. ప్రభుత్వంలోకి రాకపోయినా… తనను గెలిపించకోయినా బాధేమీ లేదని.. చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది…? కానీ పవన్ కల్యాణ్ అలా చెప్పేస్తూ ఉంటారు.
అప్పట్లో టీడీపీ… ఇప్పుడు వైసీపీని రానివ్వబోమని శపథాలు !
తమ పార్టీ గెలుపును.. ప్రమోట్ చేసుకోవాలి. తమ పార్టీయే ప్రత్యామ్నాయం అని చెప్పాలి. కానీ పవన్ కల్యాణ్ ఈ విషయంలో మొదటి నుంచి అదే తప్పు చేస్తున్నారు. నాలుగేళ్ల పాటు టీడీపీతో బాగుండి చివరిలో తాను గెలవకపోవచ్చు కానీ టీడీపీని ఓడిస్తానన్నారు. ఆయన ఓడించారో లేదో కానీ ఆయన ఓడిపోయారు.. టీడీపీ ఓడిపోయింది. ఇప్పుడు వైసీపీ ఏపీకి హానికరమని.. ఆ పార్టీ మళ్లీ గెలవకూడదని పోరాడుతున్నారు. కానీ జనసేన పార్టీనే ప్రత్యామ్నాయ స్థాయికి తీసుకెళ్లేలా ఆయన కార్యాచణ ఉండటం లేదు. దీంతో కరుడుగట్టిన జనసైనికుల్లో తప్ప.. ఇతరుల్లో నమ్మకం పెరగడం లేదు.
ప్రసంగ తీరు అప్పుడు.. ఇప్పుడు ఒకటే !
పవన్ రాజకీయ పయనం ప్రారంభించిన కొత్తలో ప్రసంగం ఒక చోట ప్రారంభించి హఠాత్తుగా వేరే చోటుకు వెళ్లిపోతుంది. కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లేలా సాగుతూ ఉండేది. స్పీచ్‌లో వెంట వెంటనే వేరియేషన్స్ కనిపిస్తూఉంటాయి. ఇప్పుడుకూడా అదే జరుగుతోంది. ప్రసంగంలో చెప్పిందే చెప్పడమే కాదు.. కంటిన్యూటీ ఉండటడం లేదు. ఇవన్నీ మొదటి నుంచి ఉన్న విమర్శలే. దీనిపై ఎన్నో సూచనలు వస్తున్నా.. జనసేనాని ఎందుకు మార్చుకోలేకపోతున్నారో కానీ.. చిన్న చిన్న అంశాలే ఇబ్బందికరంగా మారుతున్నాయన్న వాదన వినిపిస్తోంది.