పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు అనే అంశం రాజకీయ ప్రత్యర్థులు ఎప్పుడు అస్త్రంగా వినియోగించుకుంటూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి రావడం వల్ల, ఇదివరకు ఎప్పుడూ అధికారం చేపట్టకపోవడం వల్ల సహజంగానే తనమీద అవినీతి ఆరోపణలు చేసే వీలు ప్రత్యర్థులకు లేదు. అందువల్ల తన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసుకొని అప్పుడప్పుడు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ నిన్న ఈ వ్యాఖ్యలపై స్పందించారు.
కాస్త వేదాంత ధోరణిలోనే మాట్లాడిన పవన్ కళ్యాణ్ , తానేమీ ఒళ్ళు కొవ్వెక్కి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదని అది తన కర్మ అని , జరిగిన సంఘటనలు దురదృష్టం అని వ్యాఖ్యానించారు. చాలామంది లాగ ఒక్క పెళ్లి మాత్రమే చేసుకుని బయట బలాదూరుగా తిరిగే వ్యక్తి ని కానని తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్న పవన్ కళ్యాణ్ , తన జీవితంలో పార్టీలు ,పబ్బులు ఉండవని ,ఇంట్లోనే ఓ మూల కూర్చుని పుస్తకాలు చదువుకుంటూ ఉంటానని చెప్పుకొచ్చాడు. ఎప్పుడూ ప్రజల గురించి , వారి సమస్యల గురించి ఏడ్చే తనలాంటి వ్యక్తితో అవతలివాళ్లకు ఏం ఆనందం ఉంటుందని , అయినా ఇదంతా తన కర్మ అని, దానికి తాను మాత్రం ఏం చేయగలనని వేదాంత ధోరణిలో మాట్లాడారు పవన్ కళ్యాణ్.
అయితే రాజకీయ నాయకులను మాత్రం మరొకసారి దుయ్యబట్టాడు. తాను ప్రజా సమస్యల గురించి మాట్లాడితే వారు నా పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశాడు. నిడదవోలులో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లేదు అని తాను ప్రశ్నిస్తే దానికి వారు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అని సమాధానం చెబుతున్నారు అన్నాడు.
ఏదిఏమైనా, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలోని అంశాలు రాజకీయ ప్రత్యర్ధులకు అస్త్రాలుగా మారే అవకాశం లేదని అనిపిస్తోంది. ఆమధ్య జగన్ ఇదే అంశం మీద అస్త్రాలు సంధిస్తే అవి తనమీద కే బ్యాక్ ఫైర్ అవ్వడం తెలిసిందే.