గూండాలు, ఫ్యాక్షనిస్టులు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఉప్పెనలా దాడి చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్.. నిన్న పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై తీవ్ర విమర్శలు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము కూడా వ్యక్తిగత విమర్శలకు దిగితే పారిపోతారంటూ జగన్‌ను ఉద్దేశించి ఘాటుగా అన్నారు.. రాజకీయాలు చేయడానికి వేల కోట్ల ఆస్తులు, గూండాలు అక్కర్లేదంటూ జగన్‌కు చురకంటించారు.. భీమవరం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలుచేశారు.
వ్యక్తిగతంగా చేసే విమర్శలతో సమస్యలు పరిష్కారం కావని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఇసుక మాఫియా, దోపిడీలు చేసే వీళ్లకే ఇంత ఉంటే… ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్న నాకెంత తెగింపు ఉండాలనని వ్యాఖ్యారు. పవన్ చూడటానికి మెత్తగా కనిపిస్తాడు…తేడా వస్తే తోలు తీస్తాడని హెచ్చరించారు. సమాజంలో మార్పు తీసుకొస్తానన్న భయంతోనే. టీడీపీ, వైసీపీ, బీజేపీ నన్ను టార్గెట్ చేశాయని పవన్‌కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఐదేళ్లు కష్టపడితే ముఖ్యమంత్రి లేదా మంత్రి సీట్లో కూర్చోవచ్చు.. కాని దాని వల్ల సమాజంలో మార్పు రాదన్నారు. సామాజిక మార్పు కోసం మరింత ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు ఉపదేశించారు.
చంద్రబాబు, జగన్లాంటివాళ్లు రాజ్యాంగం రాయలేదన్నారు. తాను ఒంటి స్తంభం మేడ మీద కూర్చొనేవాడిని కాదని.. నేల మీద నడిచే వ్యక్తినని గుర్తుంచుకోవాలని పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. రాజకీయాల్లో మానవత్వం చచ్పిపోయిందని.. ఆ మానవత్వం , జవాబుదారీ తనాన్ని తీసుకురావడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తనకు ఇంత మంది అభిమానులు ఉన్నారంటే.. ఏదో కారణం ఉందనిపించిందని.. ఆ కారణం సమాజానికి సేవచేయడమేననుకుంటున్నానని కార్యకర్తలకు చెప్పారు. ఓ తరంలో మార్పు రావాలంటే.. 25 ఏళ్లు పడుతుందని… అందుకే 25 ఏళ్లు రాజకీయాలు చేయడానికి వచ్చానన్నారు. ఐదేళ్లు కష్టపడితే.. ముఖ్యమంత్రి లేకపోతే.. మంత్రి పదవిలో కూర్చోవచ్చని కానీ తను దాని కోసం రాలేదన్నారు.
కార్యకర్తల సమావేశంలో పవన్ ఘాటుగా మాట్లాడినట్లు ఉన్నా.. ఎక్కడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేయలేదు. జగన్..నేరుగా పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసినా.. పవన్ మాత్రం పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. పైగా.. ఈ అంశంలో… తనను అందరూ టార్గెట్ చేశారన్నట్లుగా చెప్పుకొచ్చారు. అన్నది జగన్ అయితే.. తనును టీడీపీ, బీజేపీ కూడా టార్గెట్ చేశాయని సానుభూతి కోసం ప్రయత్నించారు.