ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలలో రాజకీయ శక్తుల పొందిక ఇప్పట్లో సులభంగా మారే సూచనలు లేవు. ఫిరాయింపుల జోరుకు అది కూడా ఒక కారణమే. ఎపి, తెలంగాణ రెండు చోట్ల కూడా బిజెపికి చాలా ఆశలున్నా అవి నెరవేరేందుకు అవసరమైన అనుకూలత, నాయకత్వ దక్షత వుండటం లేదు. కేంద్ర నాయకులకు కూడా పెద్ద ఆశలు లేవు గనకనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే భావం ఆ పార్టీ శ్రేణుల్లో వుంది. వెంకయ్య నాయుడు, బండారుదత్తాత్రేయ మాకు రెండు శనిగ్రహాలు అని బిజెపి యువ నేత ఒకరన్నారు.
ఇక కాంగ్రెస్కు తెలంగాణలో కొంత పట్టువున్నా నాయకుల అనైక్యత, వ్యయప్రయాసలకు ఓర్చుకోలేని పాత ఫక్కీ ఆటంకంగా నిలుస్తున్నాయి. తెలుగుదేశం తెలంగాణలో దెబ్బతిన్నా ఎపిలో కొంతవరకూ నిలదొక్కుకున్నట్టు కనిపిస్తుంది. వైసీపీ కార్యకలాపాల మందగమనం, విస్త్రుత కార్యక్రమాలు తీసుకోవడానికి మానసికంగానూ ఆర్థికంగానూ ఆ పార్టీ నేత సిద్ధం కాకపోవడం ఒకవైపు- పాలకపక్షం ఉక్కు పట్టు పెంచడం మరోవైపు కలసి వైసీపీని ఒకవిధమైన ప్రతిష్టంభనకు గురిచేశాయి.
కాంగ్రెస్ పెనుగులాడుతున్నా ఇప్పట్లో పునరుద్దరణ జరిగే అవకాశమే లేదు. వామపక్షాల ఎన్నికల బలం ఎప్పుడూ నామమాత్రం. వైసీపీ టీడీపీల వెనక వున్న సామాజిక తరగతులు పెద్దగా చెదరకపోయినా నూతన పునస్సమీకరణ జరగాలంటే మాత్రం సామాజిక కోణం ముఖ్యపాత్ర వహిస్తుంది. తెలంగాణలో కన్నా ఎపిలో కులాల వ్యవహారం మరింత బలంగా ప్రభావం చూపిస్తున్నది.
గతంలో చిరంజీవి అర్థమనస్కంగా ప్రయోగం చేసిన నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అయితే పవన్ కళ్యాన్ మొన్నటి ఎన్నికల్లో పరోక్ష పాత్రకే పరిమితమైనారు గనక – 2019లో పోటీ ప్రకటించారు గనక ఆయన ఏ వైఖరి తీసుకుంటారనేది ముఖ్యమే అవుతుంది. బిజెపికి అనుకూలంగా వుంటే ఆయన పాత్ర ప్రభావం కూడా పరిమితమవుతాయి. కనీసం తమిళనాడులో విజయకాంత్ తరహాలోనైనా స్వంత పునాదిపై నిలబడితే అప్పుడు కొంత పునస్సమీకరణకు అవకాశం వుంటుంది.
ఈ విషయం తెలుసు గనకే చంద్రబాబు నాయుడు కాపులనూ బిసీలను మంచి చేసుకోవడానికి శతవిధాల పాచికలు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక వైఖరితో ముందుకు రాకముందే తన రాజకీయ బలాన్ని పెంచుకోవాలని తంటాలు పడుతున్నారు. అయితే ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల సమస్యలు, అసంతృప్తి, కేంద్రం సహాయ నిరాకరణ వంటివి ఆయనకు ప్రతికూలంగా మారొచ్చు. దాన్ని ఉపయోగించుకోగల చతురత ఇంతవరకూ జగన్ పెద్దగా ప్రదర్శించలేకపోయారు. భవిష్యత్తులోనైనా తన దృక్పథం ఆచరణ మార్చుకుంటారో లేదో తెలియదు.
ఆ వెలితిని ఉపయోగించుకోవాలంటే పవన్ కళ్యాణ్ వంటివారు ప్రజల పక్షాన నిలబడితే కొంత ప్రభావం వుంటుంది. ఇతరులు కూడా బలపర్చే అవకాశం పరిశీలనకు వస్తుంది. అలాగాక గతంలో వలెనే మోడీ మెచ్చుకోళ్లకు పరిమితమైతే వారిపై వున్న వైముఖ్యమే ప్రజలు ఆయనపైనా ప్రదర్శిస్తారు. మరి ఈ ఆరడగుల బుల్లెట్టు గగనపు వీధి వీడి భువికి దిగి వస్తారో లేదో చూడాలి!