కాటమరాయుడు తరవాత పవన్ కల్యాణ్ చేయబోయే సినిమాపై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చేసింది. పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా మొదలు కానుంది. ఈనెలాఖరులోగా త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కేయొచ్చన్నది లేటెస్ట్ టాలీవుడ్ టాక్. పవన్ కోసం మరో తమిళ దర్శకుడు నేసన్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఓ తమిళ సినిమాని పవన్ తో రీమేక్ చేయాలని ఏఎం రత్నం ఎప్పటి నుంచో కాచుకొని కూర్చున్నాడు. నేసన్ స్క్రిప్టు రెడీ చేసేశాడని టాక్. కానీ ఈ సినిమా విషయంలో పవన్ ఇప్పటి వరకూ నోరు మెదపడం లేదని తెలుస్తోంది. నిజానికి నేసన్‌తో సినిమా చేసే విషయంలో పవన్ సముఖంగా లేడని, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే వరకూ డౌటేనని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
కాటమరాయుడు తరవాత వెంటనే రత్నం సినిమా మొదలు పెట్టేద్దామని మాటిచ్చాడు పవన్. ఓ వైపు త్రివిక్రమ్ సినిమా మరో వైపు నేసన్ సినిమా సమాంతరంగా నడిపించాలని భావించాడు. అయితే ఇప్పుడు పవన్ ప్లాన్ మారింది. పూర్తిగా త్రివిక్రమ్ సినిమాపైనే దృష్టి పెట్టాలని భావిస్తున్నాడట. అందుకే నేసన్ సినిమాని హోల్డ్‌లో పెట్టాడట. నేసన్ సినిమా చేస్తాడా, లేదా అన్నది అనుమానంగా మారిందని, ఆ స్థానంలో రత్నంతో మరో సినిమా చేయడానికి పవన్ సముఖంగా ఉన్నాడని టాక్. వరుసగా రీమేక్‌లు చేయడం అంత మంచిది కాదని, అది తన కెరీర్‌పైనా ప్రభావం చూపిస్తుందని పవన్ భయపడుతున్నాడని, అందుకే నేసన్ సినిమా పక్కన పెట్టే ఛాన్సుందని పవన్ కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి.