కులాల ఐక్యతకు జనసేన ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. రామచంద్రాపురంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ… అన్ని కులాల అభ్యున్నతే తన లక్ష్యమనీ, దళితులు ఉద్యోగాలు అడిగేవారిగా కాకుండా, ఇచ్చేవారిగా ఎదగాలన్నారు. రేప్పొద్దున్న తన బిడ్డ దళిత కులాలవారి దగ్గరకి వెళ్లి… అన్నా, నాకు ఉద్యోగం కావాలనే స్థాయిలో ఉండాలన్నారు. తాను పుట్టిన కులం కావొచ్చు, తీసుకున్న రెల్లి కులం కావొచ్చు… అందర్నీ తాను గౌరవిస్తా అన్నారు పవన్. తాను ఇంత బాధ్యతతో మాట్లాడుతుంటే… పవన్ చుట్టూ తిరిగేది సంకర జాతి వాళ్లు అంటూ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అనడం బాధ కలిగించిందన్నారు! ఇలా కుల ప్రాతిపదికన సమాజాన్ని విడగొడితే, అది విధ్వంసానికి కారణమౌతుందన్నారు పవన్.
దెందులూరు ఎమ్మెల్యే మాదిగ, మాల కులాలను దూషిస్తారనీ, మంత్రి అచ్చెన్నాయుడు మత్స్య కారులను కులం పేరుతో దూషిస్తారన్నారు. ఒక గొప్ప ఆశయంతో కులాల ఐక్యతకు జనసేన కృషి చేస్తుంటే, టీడీపీ దూషిస్తోందన్నారు. అన్ని కులాలను సమానంగా చూడకపోతే తనలో మరో వ్యక్తిని చూస్తారని టీడీపీని పవన్ హెచ్చరించారు. తనకు అన్ని కులాలు సమానమే అన్నారు. 2019లో జనసేనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలనీ, స్వచ్ఛమైన పరిపాలన ఎలా ఉంటుందో తాను చూపిస్తా అని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలను గుండెల నిండుగా నింపుకున్నవాడిననీ, కుల నిర్మూలన కంటే ముందుగా ఐక్యత సాధించాలన్నారు. వెనకబడిన కులాల అందర్నీ రాజకీయంగా ఎదగనిచ్చే శక్తి తాను ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు మీద, మంత్రి లోకేష్ మీద విమర్శలు షరా మామూలే. ప్రతిపక్ష నేత జగన్ ఉద్దేశించి మాట్లాడుతూ… అసెంబ్లీకి వెళ్లి పోరాటం చేసి మీ మగతనం ఏంటో అక్కడ చూపించండి అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్న సందర్భంలో, నాయకులెవ్వరూ మాట్లాడలేకపోతే అప్పుడు జనసేన పార్టీ పుట్టిందని మరోసారి చెప్పారు.
కులాల ఐక్యతే తన ప్రధాన అజెండా అని పవన్ అంటున్నారు బాగుంది. కానీ, ఆ పేరుతో కులాల పేర్లను పదేపదే ప్రస్థావిస్తున్నది ఎవరు..? అన్ని కులాలూ తనకు సమానం అనుకున్నప్పుడు… తాను ఏ కులంలో పుట్టానో, ఏ కులం తీసుకున్నానో… ఇలాంటివన్నీ పదేపదే ప్రస్థావించాల్సిన అవసరం ఏముంది..? కులాల నిర్మూలన, ఐక్యత అంటూనే.. వీటి గురించి మాట్లాడుతున్నారు పవన్. అంతేకాదు, టీడీపీపై విమర్శల్లో భాగంగా… కొంతమంది ఎమ్మెల్యేలు లేదా నాయకులు చేసిన వ్యాఖ్యల్ని ప్రస్థావిస్తున్నారు. అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలిగానీ, ఆ వ్యాఖ్యల్నీ ఏకంగా ఒక పార్టీకి ఆపాదించేసి విమర్శించడం ద్వారా రాజకీయ లబ్ధికి పవన్ ప్రయత్నిస్తున్నట్టు లేదా..? అందరూ సమానం అనుకున్నప్పుడు ఏ కులం పేరూ తన ప్రసంగాల్లో ఉండకూడదు కదా! ఓకే సరే… ఇంతకీ కులాల ఐక్యత కోసం జనసేన ప్రత్యేకంగా ఇంతవరకూ చేసిందేంటీ, భవిష్యత్తులో చేయాలని అనుకుంటున్నదేంటీ… ఇదైనా పవన్ స్పష్టంగా చెబుతున్నారా, లేదే.
–Subhash