రాజకీయనాయకులు ఏదో ఒక పార్టీలో ఉన్నంత కాలమే వారిని ప్రజలు గుర్తిస్తారు లేకుంటే క్రమంగా ప్రజలు కూడా వారి గురించి పట్టించుకోవడం మానేస్తారు. అప్పుడు వారు అనామకులుగా మిగిలిపోతారు. అలాగే ఈ ప్రపంచంలో మనుషులందరికీ వేర్వేరు బాష, సంస్కృతి, మూలాలు ఉంటాయి. వాటి ద్వారానే వారిని ప్రపంచం గుర్తిస్తుంది. అవి వద్దనుకొంటే వారు తమ గుర్తింపునే కోల్పోతారు. ఇదే మాట పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు.
మొన్న శుక్రవారం లండన్ లో జరిగిన యుకె తెలుగు అసోసియేషన్ ఆరవ వార్షికోత్సవాలలో ప్రత్యేక అతిధిగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం మాట్లాడుతూ, “మన బాషని, యాసని, సంస్కృతీ సంప్రదాయాలని ఎన్నడూ మరిచిపోకూడదు. మన కళలు, సాహిత్యం వాటిని ప్రతిభింబింస్తుంటాయి. మన తెలుగుజాతి సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనాన్ని తెలియజేసే ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినందుకు మీ అందరికీ అభినందనలు. నేను కూడా నా సినిమాల ద్వారా మన సంస్కృతీ సంప్రదాయాల గొప్పాదనాన్ని చాటిచెప్పే తెలుగు జానపదగీతాలని ప్రోత్సహిస్తాను. తల్లితండ్రులు కూడా తమ పిల్లలకి చిన్నప్పటి నుంచే మన మాతృబాష, సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలియజేస్తే అవి భావితరాలకి కూడా వ్యాపిస్తాయి,” అని అన్నారు.
పవన్ కళ్యాణ్ ఏదో మొక్కుబడిగా ఈ మాటలు చెప్పడం లేదని అందరికీ తెలుసు. సినిమా సక్సెస్స్ అవడానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జొప్పించవలసి వచ్చినా జానపద సాహిత్యంపై ఆయనకున్న మమకారం అయన సినిమా పాటలలో గుబాళిస్తూనే ఉంటుంది. అయితే నేటి యువత దృష్టి అంతా ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగాలపైనే ఉన్నందున వారికి కళలు, సాహిత్యం పట్ల ఆసక్తి తగ్గిపోటోంది. అందువల్లే సినీ పరిశ్రమలో ఉన్నవాళ్లు కూడా అటువంటి కధాంశంతో సినిమాలు తీయడానికి వెనుకాడవలసి వస్తోంది. ఈ సమస్య ఇవ్వాళ్ళ కొత్తగా మొదలయింది కాదు. సుమారు నాలుగు దశాబ్దాల క్రితమే మన పాఠాశాలలో ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశించినప్పుడే మన బాష, సంస్కృతి, సంప్రదాయాలు, వాటిని ప్రతిభించే కళలు, సాహిత్యం తమ ప్రాధాన్యతని కోల్పోవడం ప్రారంభించాయని చెప్పవచ్చు. కనుక వాటిని…వాటితో ముడిపడున్న మన గుర్తింపుని కాపాడుకోవాలంటే, పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తల్లితండ్రులు తమ పిల్లలకి బాల్యం నుంచే వాటిని అలవరచడమే సరైన మార్గం.