పవన్ కళ్యాణ్ ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక విలేఖరి “చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయినప్పుడల్లా మీరు పరుగున వచ్చి ఆపద్బాంధవుడులా కాపాడుతుంటారు. ఇప్పుడు కూడా అందుకే వచ్చేరా? అని చాలా సూటిగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్న విని పవన్ కళ్యాణ్ మోహంలో చిన్న చిర్నవ్వు కనిపించింది. దానికి ఆయన జవాబు చెపుతూ “నేను ఒక సాధారణ వ్యక్తిని. ఎవరినీ కాపాడే శక్తి, సలహాలు చెప్పే స్థాయి నాకు లేవు. ఏదయినా ఒక సమస్య వచ్చినప్పుడు, దానిపై నాకు తెలిసిన విధంగా స్పందిస్తుంటాను…అంతే!” అని జవాబిచ్చారు.
ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకొని ఉంటే నిన్న తునిలో జరిగిన హింసాత్మక ఘటనలను నివారించగలిగి ఉండేదని, కానీ ప్రభుత్వం ఆ విషయంలో విఫలమయిందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేసారు.
“ఉభయగోదావరి జిల్లాలలో మీరు ప్రచారం చేసినందునే తెదేపా-బీజేపీ కూటమి విజయం సాధించింది. ఆ ప్రాంతాల సమస్యలన్నిటినీ తెదేపా-బీజేపీ కూటమి పరిష్కరిస్తుందని మీరు వాటి తరపున హామీ ఇచ్చారు. ఆ తరువాత అనేక సమస్యలు ఎదురయినప్పుడు మీరు ప్రభుత్వాన్ని గట్టిగా ఎందుకు ప్రశ్నించడం లేదు? సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం దానిపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదు? ప్రభుత్వానికి ఎటువంటి సలహాలు ఇవ్వడం లేదు ఎందుకు?” అని ఒక విలేఖరి ప్రశ్నించాడు.
దానికి జవాబుగా “అవసరమయినప్పుడు నేను ప్రజాసమస్యలపై మాట్లాడుతూనే ఉన్నాను. ప్రభుత్వం యొక్క రోజువారీ వ్యవహారాలలో నేను కలుగజేసుకోనని ముందే చెప్పాను. అవసరమనిపించినపుడు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళుతున్నాను. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రజలకు కొన్ని హామీలు ఇస్తుంటాయి. వాటిలో కొన్నిటికోసం చట్ట సవరణలు చేయవలసి ఉంటుంది. అది చేయగలమనే నమ్మకంతోనే పార్టీలు హామీలు ఇస్తుంటాయి. ఎన్నికలలో ప్రజలను ఆకట్టుకోవడానికి ఆవిధంగా చేస్తుంటాయి. వాటి సాధ్యాసాధ్యాల గురించి ఎన్నికల తరువాతే తెలుస్తుంది. అందుకే అటువంటి హామీల అమలు ఎంతవరకు సాధ్యమని నేను అడుగుతుంటాను,” అని పవన్ కళ్యాణ్ చెప్పారు.