దక్షిణాది రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు.. చెన్నై వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి వచ్చిన …పవన్ కల్యాణ్.. తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ పోరాటయాత్ర ప్రారంభించారు. శుక్రవారం జరిగిన పోరాటయాత్ర ప్రసంగంలో మళ్లీ.. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఈ సారి వ్యక్తిగత విమర్శలకు తోడు.. పోలికలు తెచ్చుకున్నారు. ప్రజల సమస్యలపై పోరాటం చేసే ధైర్యం జగన్ కు లేదని మండిపడ్డారు. పోరాటం చేయకుండా రోడ్లపై తిరిగే జగన్ కావాలో?.. సినీ సంపాదన వదులుకుని పోరాటం చేస్తున్న పవన్ కావాలో..? తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి ఘటన తర్వాత.. వైసీపీ చేసిన రాజకీయాలపై.. కూడా పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాజానగరం సభకు వెళ్తుంటే తన కాన్వాయ్‌ని ఇసుక లారీ ఢీకొట్టిందని ప్రకటించారు. అయినా తాను.. కోడికత్తి గుచ్చారంటూ జగన్‌లా రాజకీయం చేయలేదని సెటైర్ వేశారు.
సభలో చంద్రబాబుపై విమర్శలు చేసినా.. పవన్ కల్యాణ్.. ఎక్కువగా జగన్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అదీ కూడా ఇటీవలి కాలంలోనే ఈ దాడి జరుగుతోంది. నిజానికి రాజమండ్రి ధవళేశ్వరం వంతెనపై కవాతు జరిగినప్పుడు.. ఆ తర్వాత చంద్రబాబు, లోకేష్‌ను తీవ్రంగా విమర్శించారు కానీ.. జగన్ ను ఏమీ అనలేదు. పైగా.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరనే కబుర్లు కూడా చెప్పారు. ఇటీవలి కాలంలో… పవన్ కల్యాణ్ వైఖరి మారిపోయిది. జగన్ ను.. మగతనం ఉందా అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఆయనకు ఏమీ చేతకాదంటూ మండి పడుతున్నారు.
ఇదే సమయంలో.. కొద్ది రోజుల కిందట.. కారెం శివాజీ అనే టీడీపీ నేత… వట్టి రవి అనే వ్యక్తి ఇంట్లో.. జగన్, పవన్ సమావేశమై.. పొత్తు చర్చలు జరిపారని.. పవన్ 40 సీట్లు అడిగినందున పొత్తు చర్చలు విఫలం అయ్యాయని ప్రకటించారు. దీనిపై.. జనసేన ఎలాంటి ప్రకటన చేయలేదు. జగన్ కూడా.. ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. దీంతో.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు.. పవన్ కు బహిరంగలేఖ రాసి.. జగన్ తో చర్చల విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు. అయినా పవన్ స్పందించలేదు కానీ.. విమర్శలు మాత్రం పెంచుకుంటూ పోతున్నారు. జగన్ పై .. పవన్ కు అంత కోపం రావడానికి కారణమేమిటో మాత్రం కాస్త సస్పెన్స్ గానే ఉంది.