పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు. అంతకు ముందు తీసుకున్న అడ్వాన్సులకు లెక్క చెప్పడం కోసమో, మళ్లీ అభిమానుల్ని అలరించడానికో, ఆర్థిక అవసరాల కోసమో మళ్లీ మేకప్ వేసుకోవాలని ఫిక్సయ్యాడు. మైత్రీ మూవీస్, డి.వి.వి దానయ్య, రత్నం… వీళ్ల దగ్గర పవన్ ముందే అడ్వాన్సులు తీసుకున్నాడు. సినిమాలు చేస్తానని మాటిచ్చాడు. కానీ 2019 ఎలక్షన్ హడావుడిలో పడి… సినిమాల్ని వదులుకున్నాడు. అందుకే ఇప్పుడు అడ్వాన్సులు క్లియర్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే `కథలు రెడీ చేసుకోండి.. నేను సినిమాలు చేయడానికి సిద్ధమే` అంటూ నిర్మాతలకు సంకేతాలు పంపాడని తెలుస్తోంది. దాంతో నిర్మాతలంతా హడావుడిగా పవన్ కి తగిన కథల్ని వెదికిపట్టే పనిలో ఉన్నారు. పవన్ కాస్త బద్దకస్తుడే. రెండేళ్లకు ఓ సినిమా పూర్తి చేస్తుంటాడు. అయితే… రెండేళ్లలో మూడు సినిమాలైనా ముగించాలని భావిస్తున్నాడట పవన్. 2022 నాటికి మళ్లీ పూర్తిగా రాజకీయ జీవితంపై దష్టి పెట్టాలని, ఈలోగా తన ఇమేజ్ ని, పొలిటికల్ మైలేజీనీ పెంచుకునే సినిమాలు చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడట. పవన్ మళ్లీ సినిమాలవైపు దష్టి పెట్టడం ఆనందకరమైన విషయమే. కానీ.. తన ఇమేజ్ కి సరిపడ కథల్ని వెదికిపట్టుకోవడమే నిర్మాతలకు ఓ ఛాలెంజ్.