పవన్ కల్యాణ్ మీద భాజపా ఎంపీ జీవీఎల్ కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై ఘాటుగా స్పందించారు జనసేన అధినేత. చిత్తూరు జిల్లా రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ… తాను ఎక్కడ తగ్గాలో నేర్చుకుంటే మంచిది అని భాజపా ప్రతినిధి అన్నారనీ, అయితే ఎక్కడ తగ్గాలో తెలుసుకోకుండా తాను ఇంత దూరం రాలేదన్నారు. అవసరమైతే ఎక్కడ పెరగాలో కూడా తనకు బాగా తెలుసని పవన్ కౌంటర్ ఇచ్చారు. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని చిన్నప్పుడు టీచర్లు చెప్పారనీ, అలాగని మీరొచ్చి మా మీద ఎక్కితొక్కుతుంటే.. చూస్తూ ఊరుకోననీ, కిందపడేసి కొడతామని కూడా మర్చిపోవద్దన్నారు. ‘నా దేశభక్తిని ఏంటో తెలియాలంటే వెళ్లి మీ ప్రధానమంత్రిని అడిగి తెలుసుకోవాల’న్నారు.
ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే దేశభక్తి ఉన్నది, సీపీఐ సీపీఎంలకు లేదా, జనసేన పార్టీకి లేదా, వేరే ఏ పార్టీలకీ ఉండదా అంటూ పవన్ నిలదీశారు. దేశభక్తికి ఒక్క భాజపా నాయకులు మాత్రమే పెట్టి పుట్టారా అన్నారు. ‘భాజపా అధికార ప్రతినిధికి ఒకటే చెబుతున్నా. మీరు కొంచెం నోరు నియంత్రించుకొండి. మీరు యుద్ధానికి సై అంటే నేను రెండుసార్లు సై అంటా. మీ నాయకులంటే గౌరవం ఉంది. కానీ మీ బానిసను కాదని గుర్తుపెట్టుకోవాలి’ అంటూ హెచ్చరించారు. తాను మాట్లాడిందేంటో తెలియాలంటే అన్ని ఇంటర్వ్యూలు చూడండి అన్నారు. చట్టసభలో ఆంధ్రాకి వచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారు కాబట్టి భాజపాతో తాను విభేదిస్తున్నానని పవన్ చెప్పారు.
ఇతర అంశాలపై మాట్లాడుతూ… రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులున్నా ఈ ప్రాంతాన్ని ఎవ్వరూ అభివృద్ధి చెయ్యలేదన్నారు. లక్ష కోట్లు తినే నాయకుడు, లక్షల కోట్లు తిన్నారని వైకాపా ఆరోపణలు చేసే నాయకులున్నారే తప్ప… లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎవ్వరూ చెప్పడం లేదన్నారు. కియా ఫ్యాక్టరీ తెస్తే సరిపోదని, యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలని, ఆ పని జనసేన చేస్తుందని హామీ ఇచ్చారు. తనకు ప్రజలు ఎంత బలమిస్తే అంత పోరాటం చేస్తాననీ, ముఖ్యమంత్రిని చేయగల బలమివ్వాలన్నా అది ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. ఎన్ని సీట్లు వస్తాయా అనే అంచనాతో రాజకీయాలు చేయడం లేదనీ, ఎంత మార్పు తీసుకుని రాగలనా అని మాత్రమే ఆలోచిస్తా అన్నారు పవన్. రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు బెంచ్ వచ్చేలా కృషి చేస్తా అన్నారు. జనసేన మేనిఫెస్టో ఎలా ఉండబోతోందనేదీ కొంత వివరించారు.