జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ మధ్య ఉత్తర, దక్షిణ భారతదేశం అంటూ మాట్లాడేవారు! కేంద్ర ప్రభుత్వం దక్షిణాదిపై సవతి తల్లి ప్రేమ చూపుతోందనీ, అభివృద్ధి అంతా ఉత్తరాదికే పరిమితమౌతోందని అనేవారు. దక్షిణాది వేరు, ఉత్తరాది వేరు అని చాలా సభల్లో ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాదిని నిర్లక్ష్యం చేయడం దేశానికి మంచిది కాదంటూ మాట్లాడేవారు. సరే, ఈ మధ్య ఆ మాటను వదిలేశారు. తెలుగుదేశంతో ఢీ అంటున్న దగ్గర నుంచీ రాష్ట్ర సమస్యలపైనే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ప్రజా పోరాట యాత్రలో ఉన్న పవన్ ఇప్పుడు కొత్తగా ‘మూడు ముక్కలు’ అంటూ మాట్లాడుతున్నారు.
జనసేన కేడర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ… తాను యూనివర్శిటీలకు వెళ్లలేదుగానీ, సమాజాన్ని అధ్యయనం చేశానని పవన్ చెప్పారు. సగటు మనిషి కష్టాలనీ, కన్నీళ్లనీ అధ్యయనం చేసి వచ్చాను అన్నారు. సమకాలీన రాజకీయాల్లో నాయకుడిగా ఉండాలంటే సమాజాన్ని అర్థం చేసుకోవాలనీ, ప్రజల స్థితిగతులపై సమగ్ర అవగాహన పెంచుకోవాలని పవన్ చెప్పారు. హైదరాబాద్ విషయంలో చేసిన తప్పులే అమరావతిలో మళ్లీ ప్రభుత్వం చేస్తోందన్నారు. మొత్తంగా పెట్టుబడి అంతా అక్కడే పెట్టి, శ్రమశక్తిని అక్కడే కేంద్రీకరిస్తున్నారు అన్నారు. ప్రభుత్వ విధానాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ మూడు ముక్కలు అయిపోయే పరిస్థితి చాలా బలంగా ఉందన్నారు! పాలకులు చేస్తున్న తప్పులకు మళ్లీ విచ్ఛిన్నం అయిపోతుందా అనే భయం తనని వెంటాడుతోందన్నారు. ఇక, శ్రీకాకుళం జిల్లాలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు గురించి మాట్లాడుతూ… విదేశాల్లో చాలా అధ్యయనం చేశానన్నారు. ఒకవేళ అణు విద్యుత్ కేంద్రానికి ఏదైనా జరిగితే, శ్రీకాకుళం నుంచి వైజాగ్ దాకా నాశమైపోతుందన్నారు. ఇలా ఉంది పవన్ వైఖరి..!
ఒక నాయకుడికి పరిస్థితులపై ఆందోళన ఉండొచ్చు. కానీ, తన భయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లకూడదనే అవగాహన ఉండాలి. ఓపక్క సమాజాన్ని యూనివర్శిటీలకు మించిన స్థాయిలో అధ్యయనం చేస్తున్నానని పవన్ అంటారు. ఇంకోపక్క ఇలా రాష్ట్రం మూడు ముక్కలౌతుందనే వాదాన్ని తెరమీదికి తెస్తారు. ఇలాంటి మాటల ద్వారా ప్రజలకి ఎలాంటి సంకేతాలు పంపుతున్నట్టు..? ఎలాంటి భావజాలంవైపు జనాన్ని నడిపిస్తున్నట్టు..? విభిజత రాష్ట్రంగా నవ్యాంధ్ర ఎదుర్కొంటున్న సవాళ్లు పవన్ కి తెలియవా..? ఆదాయం లేదు, నిధుల్లేవు, రాజధాని లేదు, కేంద్ర సాయం లేదు, పరిశ్రమలు లేవు… ఇవన్నీ మన ముందున్న సవాళ్లు. ఒక నాయకుడిగా వీటి సాధన ఎలా, సమస్యల్ని ఎదుర్కోవడం ఎలా, నవ్యాంధ్ర నిర్మాణం ఎలా, అభివృద్ధి పథం వైపు ఎలా దూసుకెళ్లాలనే దిశగా ఒక ఆశావహ దృక్పథంతో, ఒక ప్రోత్సాహకరమైన వాతావరణంవైపు ప్రజలను తీసుకెళ్లేలా నాయకుడు మాట్లాడాలి. అంతేగానీ, ముక్కలైపోతుందేమో, అభివృద్ధి అందరికీ అందకుండా పోతుందేమో, ఫ్యాక్టరీలొస్తే నాశనం అయిపోతామేమో… అంటూ ఇక నిరాశావాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం నాయకుడిగా, ఇంకా చెప్పాలంటే కొత్తతరం రాజకీయాలు చేస్తానని చెబుతున్న జనసేనానిగా ఇలాంటి ముక్కల మాటలు ఎంతవరకూ సరైనవి అనేవి ఆయనే ఆలోచించుకోవాలి. ఉన్న సమస్యలను సమర్థంగా ఎదుర్కోవడం ఎలాగో ప్రజలకు నేర్పించాలి, ఆ క్రమంలో వారికి ఆదర్శంగా నాయకుడు నిలవాలి. అంతేగానీ… భవిష్యత్తుపై భయాందోళనలు కలిగించడం ఎంతవరకూ సరైంది..?