తుఫాను బాధితుల నుంచి తనకు వస్తున్న వినతుల్ని అన్నీ గుర్తుపెట్టుకుని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అంతిమ నివేదిక ఇస్తా అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇక్కడి సమస్యలు బయటకి తెలియడం లేదనీ.. ముఖ్యమంత్రి వచ్చి ఫొటోలు దిగేసి వెళ్లిపోయారని శ్రీకాకుళం జిల్లాలో పవన్ ఎద్దేవా చేశారు. గవర్నర్ నర్సింహన్ కూడా ముఖ్యమంత్రి బాగా చేస్తున్నారంటూ మెచ్చుకున్నారన్నారు. ఇక్కడున్న సమస్యల్నీ తాను తెలుసుకుని బలంగా మాట్లాడతా అన్నారు పవన్!
బాధలు వచ్చినప్పుడు నాయకుడిని ప్రజలు నిలదీస్తారనీ, తిడతారనీ వాటిని భరించాలన్నారు! ‘వాళ్లబ్బాయి గోల పెట్టట్లా… ముఖ్యమంత్రి అవ్వాలీ అవ్వాలీ అనట్లే, భరించట్లేదా ఆయన వాళ్లబ్బాయిని. నీకెందుకురా ముఖ్యమంత్రి పదవీ.. సరదాగా సైకిల్ తొక్కోరా అని మాత్రం చెప్పరు’ అంటూ చంద్రబాబును ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. ప్రజలు తిడితే భరించాలనీ, అంతేగానీ రేషన్ కార్డులు తీసేస్తామంటూ బెదిరిస్తే ఎలా అన్నారు పవన్. స్థానిక టీడీపీ నేతలు ప్రజలను బెదిరించొద్దనీ, ఈ రోజు మీకు అధికారం ఇచ్చింది కూడా తామేనని గుర్తుంచుకోవాలన్నారు.
తుఫాను బాధితులకు టీడీపీ ప్రభుత్వం ఏం చెయ్యడం లేదనీ, మంత్రి నారా లోకేష్ ఎందుకు పర్యటిస్తున్నారో తెలీడం లేదనీ, అందుకే తాను విమర్శిస్తున్నాననీ, దీన్లో రాజకీయ లబ్ధి ఏముందని పవన్ అన్నారు. ఎంపీ రామ్మోహన్నాయుడు ఢిల్లీలో బిజీగా ఉన్నారు వారిని డిస్ట్రబ్ చెయ్యద్దనీ, ఆయనా లోకేష్ గారు చాలా బిజీగా ఉన్నారు వాళ్లని డిస్ట్రబ్ చెయ్యొద్దని ఎద్దేవా చేశారు. ప్రజలు కష్టాలు పడుతున్నారనీ, ముఖ్యమంత్రి ఇబ్బంది పడట్లేదని అన్నారు పవన్. పెద్ద అనుభవజ్ఞులనే కదా తాను మద్దతు ఇచ్చిందనీ, మా అన్నయ్యని వదిలి ఎందుకొచ్చాను.. ఆయన్ని సపోర్ట్ చేయడానికే కదా, అందరికీ అండగా నిలబడతారనే కదా అన్నారు పవన్. తాను టీడీపీని తిట్టడానికి ఇక్కడ రాలేదనీ, తుఫాను వల్ల ప్రజలు నష్టపోతే వారి తరఫున మాట్లాడుతున్నాననీ పవన్ అన్నారు. సహాయక చర్యలన్నీ వారితోనే చేయిద్దామనీ, ప్రజలకు ఏ పార్టీ ద్వారా మంచి జరిగినా ఆనందమే అన్నారు. ఆ పేరు మంచిపేరు టీడీపీ సంపాదించుకున్నా మంచిదే అన్నారు.
కష్టాలు తెలుసుకోవడానికి మాత్రమే వచ్చానని ప్రజలతో మాట్లాడటం ప్రారంభించిన పవన్… ఎక్కువగా ముఖ్యమంత్రినీ, మంత్రి నారా లోకేష్ మొదలుకొని స్థానిక టీడీపీ నేతల మీద విమర్శలు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. కూలిపోయిన చెట్టు తొలగించాలంటే సమయం పడుతుందని ఆయనే అంటూనే… ప్రభుత్వం ఆలస్యంగా పని చేస్తోందని అంటున్నారు..! రాజకీయాలు చెయ్యడానికి రాలేదంటూనే రాజకీయాలు మాట్లాడుతున్నారు.