‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ సినిమాకి బూస్టప్ ఇవ్వడానికి పవన్ కల్యాణ్ ముందుకొచ్చాడు. ఈ సినిమా థ్యాంక్యూ ఇండియా మీట్‌కి పవన్ కల్యాణ్ గెస్ట్‌గా వచ్చాడు. చిత్రబృందాన్ని అభినందించి వెళ్లాడు. బన్నీ నటించిన ‘ఆర్య’ సినిమా అంటే తనకు చాలా ఇష్టమని, అల్లు అర్జున్ ఎదుగుదల తనకు ఆనందాన్ని కలిగించిందని, అల్లు అర్జున్ ఇలానే మరిన్ని విజయాలు అందుకోవాలని అభిలషించాడు పవన్. తను అల్లు అర్జున్ పేరు పలకరించిన ప్రతీసారీ `గారూ` అని సంబోధించడం అభిమానుల్ని ఆకట్టుకుంది. వక్కంతం వంశీ `కొమరం పులి` సమయంలో తనకు ఓ కథ చెప్పాడని, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయానని గుర్తు చేసుకున్నాడు పవన్. నాగబాబు కూడా ఈ చిత్రానికి నిర్మాత అని తనకు ఇప్పటి వరకూ తెలీదని, తామిద్దరూ సినిమా విషయాలు చాలా తక్కువ మాట్లాడుకుంటామన్నాడు పవన్. ఇదే రోజు ‘నేల టికెట్’ ఆడియో ఫంక్షన్‌కి కూడా పవన్ ముఖ్య అతిథిగా వెళ్లనున్నాడు. అందుకే ఈ కార్యక్రమాన్ని పవన్ తొందరగా ముగించుకోవాల్సివచ్చింది. అన్నట్టు పవన్ ఇంకా నా పేరు సూర్య చూడలేదట. ప్రచార చిత్రాలు తనని ఆకట్టుకున్నాయని, త్వరలోనే ఈ సినిమాని చూస్తానని చెప్పుకొచ్చాడు పవన్. పవన్ రాకతో ఈ సినిమాకి కొత్త మైలేజీ ఏమైనా వస్తుందేమో చూడాలి.