ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ నెలలో జరిగిన ఎం పి టి సి జెడ్ పి టి సి ఎన్నికల ను హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. సంచలనాత్మకమైన తీర్పును హైకోర్టు వెలువరించిన ఈ పిటిషన్ నిజానికి జనసేన పార్టీ తరఫున వేసిందే. హైకోర్టు తీర్పు హర్షణీయం అంటూ పవన్ కళ్యాణ్ తాజాగా ప్రకటన విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే..
పవన్ కళ్యాణ్ పై కోర్టు తీర్పు అనంతరం ప్రకటన విడుదల చేస్తూ, “ఏప్రిల్ నెలలో జరిగిన ఎం పి టి సి జెడ్పిటిసి ఎన్నికల ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం. ఇది ప్రజాస్వామ్యానికి స్థానిక స్వపరిపాలన కి ఊపిరిపోసిన తీర్పు. ఏడాది క్రితం నోటిఫికేషన్ జారీ చేసి కోవిడ్ పరిస్థితుల కారణంగా ఎన్నికలు రద్దు చేశారు. తిరిగి అదే నోటిఫికేషన్ పై ఏడాది తర్వాత జడ్పిటిసి ఎంపిటిసి లకు ఎన్నికలు నిర్వహించడం అంటే ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి నట్లే. ఏప్రిల్ లో ఎంపీటీసీ జడ్పిటిసి లకు ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టినపుడే జనసేన తీవ్రంగా వ్యతిరేకించింది. తాజాగా నోటిఫికేషన్ జారీ చేసి పోటీ, చేయాలనుకునే అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వాలని జనసేన స్పష్టంగా డిమాండ్ చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి సమాయత్తం కావడంతో జనసేన హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఈ ఎన్నికను రద్దు చేయాలని తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్య విజయం గా భావిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా పంతాలకు పట్టింపులకు పోకుండా తగిన సమయంలో తాజా నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించాలని జనసేన కోరుతోంది.” అంటూ ఆ ప్రకటనలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
అయితే జగన్ ప్రభుత్వం ఈ తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలని యోచిస్తున్న సందర్భంలో, ఈ ఎన్నికలు మరలా జరుగుతాయా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.