మొన్నటికి మొన్న రంగస్థలం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రంగస్థలం చిత్రానికి జాతీయ అవార్డులు రావాలని, లేకపోతే అన్యాయం జరిగినట్టే అని చిరంజీవి చెప్పారు. ఆ మాటలు ఇంకా మార్మోగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తమ్మడు పవన్ దీ అదే మాట. అయితే… చిరంజీవి జాతీయ అవార్డుల వరకే ఆగిపోతే – పవన్ కల్యాణ్ మాత్రం ఈ చిత్రాన్ని ఏకంగా ఆస్కార్‌కి పంపాల్సిందే అంటున్నాడు. రంగస్థలం సక్సెస్ మీట్‌కి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేశాడు. దక్షిణాది, ఉత్తరాతి రెండూ కలసి లాబీయింగ్ జరిపైనా సరే, ఈ చిత్రాన్ని ఆస్కార్‌కి పంపాలని, లేదంటే అన్యాయం చేసినవాళ్లం అవుతామని చెప్పుకొచ్చాడు పవన్. రామ్‌చరణ్‌పై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. చరణ్ తనకు తమ్ముడిలాంటివాడని, అన్నయ్య తనని నాన్నలాంటివాడని చెప్పాడు. “ఇది మన మట్టి కథ, మన పగలూ పంతాల కథ. ఇలాంటి సినిమాల్ని రాజకీయాలు, వర్గాలకు అతీతంగా ప్రోత్సహించాలి. రెండేళ్ల క్రితం బాహుబలికి అండగా ఎలా నిలబడ్డామో ఇప్పుడు రంగస్థలంకీ అలానే నిలబడాలి“ అన్నాడు పవన్ కల్యాణ్. సుకుమార్ అంటే తనకు ఇష్టమని, పదేళ్ల క్రితమే కలసి ఓ కథ చెప్పాడని, కానీ అప్పుడు పెద్దగా పట్టించుకోలేదని, కానీ తన సినిమాలు మాత్రం నచ్చుతాయని పవన్ చెప్పుకొచ్చాడు.