జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఉత్తరాంధ్ర గురించి మాట్లాడారు! ఆ ప్రాంత ఆత్మగౌరవం దెబ్బతింటోందంటూ మరోసారి తన వేర్పాటువాద ధోరణిని ట్విట్టర్ వేదిక ద్వారా పవన్ వెళ్లగక్కారు. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవం మరింతగా ప్రబలే అవకాశం ఉన్నట్టు తనకు కనిస్తోందంటూ పవన్ అభిప్రాయపడ్డారు. ఇదే నిర్లక్ష్యం ఇంకా కొనసాగుతూ పోతే త్వరలోనే ఉత్తరాంధ్ర కూడా మరో తెలంగాణ కావడం ఖాయం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. ఆంధ్రా నేతల అణచివేతల వల్లనే తెలంగాణలో ఉద్యమం ప్రారంభమైందన్నారు. అది చిన్నగా మొదలై… తీవ్రరూపం దాల్చిందనీ, చివరికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వరకూ పరిస్థితులు వెళ్లాయన్నారు. మరికొన్నేళ్లలో లేదా అంతకంటే ముందుగానే ఉత్తరాంధ్రాలో అలాంటి పరిస్థితులు వచ్చేట్టు కనిపిస్తున్నాయన్నారు. ఎప్పటివో కొన్ని మాస పత్రికల కవర్ పేజీలను అప్ లోడ్ చేసి ఇలా ట్వీటారు.
ఉత్తరాంధ్ర గురించి తన బస్సు యాత్ర ప్రారంభం నుంచే ఇలాంటి వేర్పాటు ధోరణితో పవన్ మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలను నిర్లక్ష్యం చేస్తున్నారనీ, అభివృద్ధి అంటే అమరావతి మాత్రమేననీ, ఉత్తరాంధ్ర సమస్యలు టీడీపీ సర్కారుకు కనిపించడం లేదంటూ పవన్ అంటున్నారు. ఒక ప్రాంత ప్రజలను ప్రభావితం చేసేలా పవన్ ఇలా మాట్లాడటం పద్ధతి కాదు. ఉత్తరాంధ్రలో సమస్యలు ఉన్నాయి.. ఎవ్వరూ కాదనరు. కానీ, వాటికి పరిష్కారం చూపించే దిశగా ప్రభుత్వాన్ని ప్రేరేపించే విధంగా పవన్ మాట్లాడాలి. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని విమర్శించినా ఫర్వాలేదు. టీడీపీ తీరును ప్రశ్నించినా ఎవ్వరూ కాదనరు. అంతేగానీ… ఉత్తరాంధ్ర సమస్యలు ఇంతే, ఈ నిర్లక్ష్యం ఇంతే, ఇక్కడ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటోందీ అనే వ్యాఖ్యల్లో వేర్పాటు వాద ధోరణి మాత్రమే కనిపిస్తోంది.
ఒక నాయకుడిగా పవన్ నుంచి ప్రజలు ఆశించేది సమస్యల పరిష్కారం. అంతేగానీ, తమ సమస్యలకి ఆత్మగౌరవ కోణాన్ని ఆపాదించి, మనోభావాలను రెచ్చగొడుతూ… ఇతర ప్రాంతాల నుంచి వేరు చేసే విధంగా మాట్లాడితే ఉత్తరాంధ్ర ప్రజలు కూడా హర్షించే పరిస్థితి ఉండదు. తాను ఏం మాట్లాడినా ఆచితూచి, ఏ మాట అనేస్తే ఏమైపోతుందో అనే కొలతలేసుకుని మాట్లాడతా అని పవన్ చాలాసార్లు చెప్తారు. మరి, ఉత్తరాంధ్ర విషయంలో తెలంగాణ తరహా ఉద్యమం వచ్చేస్తుందన్న రీతిలో పవన్ లాంటి జనాకర్షణ ఉన్న నాయకుడు వ్యాఖ్యానిస్తే.. ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయో పవన్ ఆచితూచలేకపోతున్నారా..?