రాజకీయాల్లో ఫలానాది జరుగుతుందని చెప్పలేం. ఫలానాది జరగదని కూడా చెప్పలేం. ఉత్తర, దక్షిణ ధృవాలు కలుస్తాయి. స్వాతంత్ర భారతదేశంలో ఇది ఎప్పటికప్పుడు నిరూపితమవుతూనే ఉంది. ఏపీలోనూ అలాంటి పరిస్థితులే కనిపించబోతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త పొత్తులు తప్పవని.. పార్టీ నేతలకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. బహుశా.. అది కాంగ్రెస్ పార్టీతో పొత్తు గురించేనన్న విశ్లేషణలు ఉండనే ఉన్నాయి. చంద్రబాబు అలా అని అనక ముందే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో ప్రకటన చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ తనకు శత్రువు కాదని స్పష్టం చేశారు. సందర్భం లేకపోయినా.. ప్రత్యేకంగా కల్పించుకుని మరీ ఈ ప్రకటన చేశారు. రాష్ట్రంలో బలమైన, సుపరిపాలన కోసమే ఆనాడు టీడీపీకి మద్దతిచ్చానన్నారు. కానీ అలాంటి పాలన టీడీపీ ఇవ్వడం లేదని.. నాలుగో ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి పవన్ కల్యాణ్ చెబుతున్నారు.
పవన్ కల్యామ్.. రాజకీయ వ్యూహాలు గందరగోళంగా ఉంటున్నాయి. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చినా ఆయన ఎన్నికలపై ఒక్క రోజు కూడా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు దృష్టి పెట్టినా.. ఎన్నికల్లో పోటీ సాధ్యం కాకపోవచ్చు. అంటే.. ఎన్నికలకు దూరంగా ఉన్నట్లే. ఇప్పటి వరకూ.. పార్టీ పెట్టిన తర్వాత పవన్ కల్యాణ్.. తన పార్టీతో ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగలేదు. నేరుగా ఆయన ఏపీలోనే దిగాలనుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. తెలంగాణలో పోటీ దిగకపోవడానికి కేసీఆర్ ఒత్తిడి ఉందన్న ప్రచారం అక్కడి రాజకీయవర్గాల్లో ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడూ లేని విధంగా కొంత కాలం కిందట ఎట్ హోం కార్యక్రమానికి పవన్ కల్యాణ్‌ను గవర్నర్ ఆహ్వానించారు. ఆ సమయంలో కేసీఆర్ ఆహ్వానించడంతో తర్వాత ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఆ తర్వాత నుంచి ఆయన రాజకీయ స్టాండ్ మారిపోయింది. ఇప్పుడు తెలంగాణలో పోటీకి వెనుకాడటం వెనుక అప్పుడు జరిగిన చర్చల ఫలితం కావొచ్చన్న అంచనాలున్నాయి.
ఆ వ్యూహం ప్రకారం.. ఏపీలో జగన్, పవన్ కలసి పని చేస్తారన్న ప్రచారం కూడా ఇప్పుడు ఊపందుకుంది. ముఖ్యంగా.. చంద్రబాబును ఓడించి తీరుతానని శపథం చేసినట్లుగా.. కేసీఆర్ తీరు ఉంది. ఆయన పవన్ కల్యాణ్‌తో తనకు ఉన్న సన్నిహిత సంబంధాల నేపధ్యంలో.. జగన్‌తో కలిసి పోటీ చేసేలా ఒప్పించారన్న ప్రచారమూ ఉంది. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిస్తే.. అది పెద్ద మైనస్ అవుతుంది కాబట్టి.. ఆ పార్టీతో లోపాయికారీ వ్యవహారాలుంటాయంటున్నారు. ఈ ప్రచారానికి తగ్గట్లుగానే పవన్ కల్యాణ్.. జగన్ శత్రువు కాదని చెప్పుకొచ్చారు. నిజానికి పవన్ కల్యాణ్.. ఎవరైనా తనను రాజకీయంగా విమర్శిస్తేనే తట్టుకోలేరు. గుర్తు పెట్టుకుని మరీ వార్నింగ్ ఇస్తారు. అలాంటి… “కార్లు మార్చినట్లు పెళ్లాలను మారుస్తాడు.. ఆయనకు సమాధానం చెప్పుకోవాల్సి రావడం నా ఖర్మ” అని వ్యక్తిగతంగా తిట్టిన జగన్‌ను శత్రువు కాదని ప్రకటించడం… విశేషమే. భవిష్యత్ రాజకీయాలకు సూచికే ..!?