జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరుగుతున్న ఆలయాలపై దాడుల ఘటనల విషయంలో కలత చెందారు. హిందూ ధర్మంపై ప్రణాళిక ప్రకారం జరుగుతున్న దాడిగా ఆయన భావిస్తున్నారు. పిఠాపురంలో ఆలయాలను ధ్వంసం చేసినప్పుడే కఠిన చర్యలు తీసుకుంటే.. ఇప్పుడు సమస్య వచ్చేది కాదనేది పవన్ అభిప్రాయం. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆయన “ధర్మ పరిరక్షణ” దీక్షను చేపట్టారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతిఒక్కరికి ఉందని.. ప్రభుత్వ కాలయాపనతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పిఠాపురంలో విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలోనే చర్యలు తీసుకొని ఉంటే.. ఇప్పుడు ఈ పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కావన్నారు.
అంతర్వేది ఘటనలో పోలీసులు చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయని పవన్ చెబుతున్నారు. మతిస్థిమితం లేనివారు కేవలం హిందూ దేవాలయాలను.. రథాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వరుస ఘటనలపై బలమైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారనేది పవన్ అనుమానం. పవన్ పిలుపు మేరకు బీజేపీ- జనసేన నేతలందరూ… “ధర్మ పరిరక్షణ” దీక్ష చేపట్టారు. ఎవరికి వారు.. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దీక్ష చేపట్టారు. ఢిల్లీలో జీవీఎల్ కూడా దీక్ష చేశారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు.
అంతర్వేది ఆలయ రథం దగ్ధం ఘటనను.. ఇంతటితో వదిలి పెట్టాలని బీజేపీ, జనసేన అనుకోవడం లేదు. హిందూ ఆలయాలపై దాడులు అంశంపై ప్రజల్లో ఉద్యమం నిర్మించాలని నిర్ణయించారు. ఈ రోజు దీక్ష చేసిన నేతలు.. రేపు ప్రతి ఇంట్లో దీపం వెలిగించాలని నిర్ణయించారు. ఆ తర్వాత తదుపరి కార్యాచరణ ఖరారు చేసుకోనున్నారు. పవన్ కల్యాణ్ కూడా హిందూ ఉద్యమంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.