ప్రజాపోరాట యాత్రలో పవన్ కల్యాణ్ బిజీబిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. వరుసగా సభల్లో మాట్లాడుతున్నా… ఎక్కడికక్కడ స్థానిక సమస్యల్ని ప్రధానంగా ప్రస్థావించడంతో, పవన్ ప్రసంగాలు మరీ రొటీన్ అయిపోవడం లేదన్న అభిప్రాయం కలుగుతోంది. అయితే, పవన్ వరకూ ఓకే.. కానీ, కార్యక్రమం నిర్వహణ, సభల ఏర్పాటు వంటి అంశాల్లో కేడర్ లో కొంత గందరగోళం నెలకొంటోందని సమాచారం! పవన్ యాత్రల్లో కొన్ని బ్రేకులు తప్పడం లేదు. దీనికి కారణం పార్టీ కేడర్ లో లోపిస్తున్న సమన్వయమే అని సమాచారం.
సమస్య అంతా ఎక్కడొస్తోందంటే… పవన్ తోపాటు కొంతమంది నేతలు యాత్రలో వస్తున్నారు, సభల ఏర్పాట్లు వంటి కార్యక్రమాలు స్థానిక నేతలకు అప్పగిస్తున్నారు! దీంతో స్థానిక నేతలకూ పవన్ తో వస్తున్న నేతలకూ మధ్య సమన్వయం కుదరడం లేదని టాక్. పవన్ తో వస్తున్నవారు… సభల ఏర్పాట్లు ఫలానాలా ఉండాలని చెబుతుంటే, క్షేత్రస్థాయిలో దాన్ని తు.చ. తప్పకుండా అమలు చేయడంలో స్థానిక కేడర్ కొంత గందరగోళానికి గురౌతున్నట్టు సమాచారం. దీంతోనే పవన్ యాత్రలకు బ్రేకులు తప్పడం లేదనీ, అనుకున్న సమయానికి కొన్ని సభలు ప్రారంభించలేకపోతున్నారట. స్థానికంగా ఏర్పాట్ల పర్యవేక్షణపై పరిపూర్ణ బాధ్యత ఎవరిది అనే ప్రశ్న ఎక్కడికక్కడ తలెత్తుతోందట. దీంతో ఎవరి ఆదేశాల మేరకు ఎవరు పనిచేయాలనే స్పష్టత లోపిస్తోందని వినిపిస్తోంది. నిజానికి, ఈ సమస్య పవన్ కల్యాణ్ దృష్టికీ వెళ్లిందట. ఇప్పటికే ఒకటికి రెండు సార్లు స్థానిక నేతలు కొందరికి పవన్ క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. సమన్వయ లోపం ఉండకూడదని హితవు పలికారట.
ఈ గందరగోళానికి అసలు కారణం… పార్టీ నిర్మాణ లోపం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గడచిన నాలుగేళ్లలో ఎప్పుడూ పార్టీ సమగ్ర నిర్మాణంపై పవన్ పెద్దగా ఫోకస్ పెట్టలేదన్నది వాస్తవం. క్షేత్రస్థాయి నుంచి కేడర్ ను అంచలవారీగా నిర్మించుకునే ప్రయత్నం జరగలేదు. అదే జరిగి ఉంటే… ఇవాళ్ల క్షేత్రస్థాయిలో ఈ గందరగోళం ఉండేదే కాదు. బాధ్యతల విభజన స్పష్టంగా ఉండేది. తాజా యాత్రలో భాగంగా గ్రామస్థాయి నుంచి కేడర్ నిర్మాణం జరుగుతుందని కూడా పవన్ చెప్పారు. కానీ, కేవలం సభలకు మాత్రమే పవన్ పరిమితం అవుతున్నారనే అభిప్రాయమూ వినిపిస్తోంది. సో.. స్థానిక నేతలకు క్లాసులు తీసుకున్నంత మాత్రాన సమన్వయం వచ్చేస్తుందని అనుకుంటే సరిపోదేమో కదా!